వైయస్ వివేకా హత్య కేసులో పిటిషన్ దాఖలు చేసిన నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య
- బీటెక్ రవి, వివేకా అల్లుడిని అనుమానితులుగా పేర్కొన్న తులసమ్మ
- కేసుతో సంబంధం లేని తన భర్తను అరెస్ట్ చేశారని ఆవేదన
- వివేకాకు రెండో భార్య, కొడుకు ఉన్నారని పేర్కొన్న వైనం
హత్య కేసును సీబీఐ అధికారులు ఏకపక్షంగా దర్యాప్తు చేస్తున్నారని పిటిషన్ లో తులసమ్మ పేర్కొన్నారు. అసలైన నిందితులను కాకుండా కేసుతో సంబంధం లేని తన భర్తను సీబీఐ అరెస్ట్ చేసిందని అన్నారు. ఆస్తుల గొడవలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని చెప్పారు. వివేకానందరెడ్డి రెండో పెళ్లి చేసుకున్నారని, ఆమె వల్ల ఓ కొడుకు కూడా పుట్టారని, ఈ విషయం అందరికీ తెలుసని ఆమె అన్నారు.
బెంగళూరులో జరిగిన ఓ భూమి సెటిల్ మెంటులో వచ్చిన డబ్బులో రూ. 2 కోట్లు ఇస్తానని రెండో భార్యకు వివేకా చెప్పారని, కొంత ఆస్తిని కూడా ఆమె పేరిట రాశారని తెలిపారు. ఈ వ్యవహారంలో వివేకాకు, ఆయన కుటుంబానికి మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పారు. వివేకా రెండో భార్యను అల్లుడు ఎన్నో సార్లు బెదిరించారని తెలిపారు.