పాకిస్థాన్‌లో ముర్రేలో భారీ హిమపాతం.. రాత్రంతా వాహనాల్లో చిక్కుకుని 22 మంది పర్యాటకుల మృతి
- పాకిస్థాన్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతున్న ముర్రే
- ప్రతి శీతాకాలంలో వేలాది మంది పర్యాటకుల రాక
- మృతుల్లో 10 మంది చిన్నారులు.. పోలీసు అధికారి కుటుంబం
- ముర్రే వెళ్లే అన్ని దారులను మూసేసిన ప్రభుత్వం
- రహదారులపై చిక్కుకుపోయిన వందలాది మంది
పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న ఈ పర్యాటక ప్రదేశం ఇస్లామాబాద్‌కు 45.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని సందర్శించేందుకు ప్రతి ఏడాది శీతాకాలంలో వేలాదిమంది సందర్శకులు తరలివస్తుంటారు. ఈసారి ఇక్కడ విపరీతంగా మంచు కురుస్తుండడంతో ఉష్ణోగ్రతలు మైనస్ 8 డిగ్రీలకు పడిపోయాయి. మరోవైపు, ముర్రేకు వెళ్లే అన్ని దారులను ప్రభుత్వం మూసివేయడంతో 1,122 మంది ప్రయాణికులు రోడ్డుపై చిక్కుకుపోయారు. వీరికి స్థానికులు ఆహారం, దుప్పట్లు అందిస్తూ చేతనైన సాయం అందిస్తున్నారు. మరోవైపు పంజాబ్ ప్రభుత్వం కూడా తక్షణ సహాయక చర్యలు చేపట్టింది. సైన్యాన్ని కూడా ప్రభుత్వం రంగంలోకి దింపింది.