భారత కెప్టెన్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును అధిగమించిన పాక్ కెప్టెన్ బాబర్
- టీ20 క్రికెట్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న బాబర్
- ఆడిన 26వ ఇన్నింగ్స్ లోనే ఘనత
- ఈ రికార్డును గతంలో 30 ఇన్నింగ్సుల్లో సాధించిన కోహ్లీ
బాబర్ అజామ్ 51 పరుగులు పూర్తి చేసి టీ20 క్రికెట్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆడిన 26వ ఇన్నింగ్స్ లోనే అతడు 1,000 పరుగులు పూర్తి చేయడం గమనార్హం. ఈ రికార్డును కోహ్లీ 30 ఇన్నింగ్సుల్లో పూర్తి చేశాడు. దీంతో కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన క్రికెటర్ గా బాబర్ నిలిచాడు.
అప్పట్లో కోహ్లీ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫా డుప్లెసిస్ (31 ఇన్నింగ్సుల్లో), ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ (32 ఇన్నింగ్సుల్లో), న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (36 ఇన్నింగ్సుల్లో)లను బద్దలు కొట్టాడు. ఇప్పుడు కోహ్లీ రికార్డును బాబర్ అధిగమించాడు. కాగా, ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ రషీద్‌ఖాన్ కూడా టీ20ల్లో రికార్డు నెలకొల్పాడు. నిన్న జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్.. రెండు వికెట్లు తీసిన అనంతరం అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.
అంతకుముందు శ్రీలంక మాజీ బౌలర్ లసిత్ మలింగపై 76 ఇన్నింగ్సుల్లో 100 వికెట్లు తీసిన ఘనత ఉంది. రషీద్ ఖాన్ ఆ రికార్డును 53 ఇన్నింగ్సుల్లోనే సాధించాడు. అలాగే, న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ (82 ఇన్నింగ్సుల్లో), బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ (83 ఇన్నింగ్సుల్లో) 100 వికెట్లు తీశారు.
వారు ప్రస్తుతం మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. అంతేగాక, రషీద్ ఖాన్ వన్డేల్లోనూ అతి తక్కువ మ్యాచ్‌ల్లో 100 వికెట్లు తీసిన బౌలర్‌గానూ ఇప్పటికే రికార్డు నెలకొల్పాడు. మూడేళ్ల క్రితం 44 ఇన్నింగ్సుల్లోనే అతడు ఈ రికార్డు నెలకొల్పాడు.