Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రపంచం మీదికి మరో వైరస్.. ‘వెస్ట్ నైల్ వైరస్’ చుట్టేయబోతోందంటూ రష్యా హెచ్చరిక

Russia Warns of West Nile Virus
  • దోమ కాటు ద్వారా మానవుల్లోకి వైరస్
  • రష్యాలో శరవేగంగా విజృంభణ
  • ఇది సోకితే తీవ్రమైన నరాల సంబంధ సమస్యలు
  • నివారణ ఒక్కటే మార్గం
  • ప్రస్తుతానికి టీకాలు కానీ, చికిత్స కానీ అందుబాటులో లేని వైనం
రష్యాలో ఇప్పుడు మరో ప్రమాదకర వైరస్ ఒకటి విజృంభిస్తోంది. టీకా కానీ, మందులు కానీ లేని ఆ వైరస్ పేరు ‘వెస్ట్ నైల్’ (డబ్ల్యూఎన్‌వీ). ఈ వ్యాధి వున్న దోమలు కుట్టడం ద్వారా ఇది మనుషులకు సోకుతుంది. రష్యాలో వెలుగు చూస్తున్న వెస్ట్ నైల్ కేసుల్లో 80 శాతానికి పైగా నైరుతి ప్రాంతంలోనే నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో డబ్ల్యూఎన్‌వీపై రష్యా నిన్న ఆందోళనకర ప్రకటన చేసింది. ఇది మరింత చెలరేగిపోయే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ దేశాలను హెచ్చరించింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వైరస్‌ను దోమలు మోసుకెళ్లేందుకు అనువుగా ఉన్నాయని పేర్కొంది.

ఆఫ్రికాలో పురుడుపోసుకున్న ఈ వైరస్ తర్వాత యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా దేశాలకు వ్యాప్తిచెందింది. ఇది సోకిన వ్యక్తులు తీవ్రమైన నరాల సంబంధ వ్యాధుల బారినపడతారు.  ఇది దోమల ద్వారా మనుషులకు వ్యాపిస్తుందని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది. వెస్ట్ నైల్ కేసులు దోమల సీజన్‌లోనే ఎక్కువగా సంభవిస్తాయని పేర్కొంది. వేసవిలో మొదలై చివరి వరకు ఉంటుంది.

డబ్ల్యూఎన్‌వీ సోకిన వ్యక్తుల్లో ప్రతి 150 మందిలో ఒకరు తీవ్ర అస్వస్థతకు గురవుతారు. తరచూ రోగాల బారినపడతారు. కీటక నాశిని ఉపయోగించడం, పొడవు చేతులున్న చొక్కా, కాళ్ల కింది వరకు ఉన్న ప్యాంటును ధరించడం ద్వారా కొంత వరకు రక్షణ పొందొచ్చు. వైరస్ సోకిన ప్రతి 10 మందిలో 8 మందికి ఎలాంటి లక్షణాలు కనిపించవు. అలాగే ప్రతి ఐదుగురిలో ఒకరిలో తీవ్రమైన జ్వరంతోపాటు తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కీళ్ల  నొప్పులు, వాంతులు, విరేచనాలు, శరీరంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ బారినపడిన వారిలో చాలా వరకు కోరుకుంటారు. అయితే, ఆ తర్వాత కొన్ని నెలలపాటు నీరసంగా ఉంటుంది.

ఏ వయసు వారైనా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. 60 ఏళ్లు దాటిన వారికి మరింత ముప్పు ఉంటుందని సీడీసీ తెలిపింది. మరీ ముఖ్యంగా కేన్సర్, మధుమేహం, హైపర్ టెన్షన్, కిడ్నీ జబ్బులు, అవయమార్పిడి చేసుకున్న వారికి ముప్పు చాలా ఎక్కువని పేర్కొంది. ప్రస్తుతానికైతే ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఎలాంటి టీకాలు కానీ, చికిత్స కానీ అందుబాటులో లేదు. కాబట్టి నివారణే శ్రీరామరక్ష.
Russia
West Nile Virus
CDC
Mosquito

More Telugu News