జగన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ టీవీ 5 కార్యాలయంపై రాయితో దాడి.. కర్నూలు జిల్లా వాసి అరెస్ట్
- కార్యాలయానికి వచ్చిన ఓ వైద్యుడి కారు అద్దం కూడా డేమేజ్
- పట్టుకుని పోలీసులకు అప్పగింత
- నిందితుడిది కర్నూలు జిల్లా పెద్దలపురం
జిల్లాలోని బండి ఆత్మకూరు మండలం పెద్దలపురానికి చెందిన తేజేశ్వర్‌రెడ్డి (37) నిన్న హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1లో ఉన్న టీవీ 5 కార్యాలయానికి చేరుకున్నాడు. అనంతరం కార్యాలయం అద్దాలపై రాయితో దాడిచేశాడు. ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు టీవీ 5 కార్యాలయానికి వచ్చిన వైద్యుడు శ్రీధర్‌రెడ్డి కారుపై ఆ రాయి పడడంతో దాని అద్దం పగిలింది. అప్రమత్తమైన టీవీ 5 సిబ్బంది నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు మద్యం తాగి ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. జగన్‌పైనా, ఆయన పార్టీపైనా తప్పుడు ప్రచారం చేస్తున్నందుకే దాడికి పాల్పడినట్టు విచారణలో అతను తెలిపాడు.