modi: ఆదిత్యనాథ్‌ పుట్టినరోజుకు మోదీ ట్విటర్‌లో శుభాకాంక్షలు ఎందుకు తెలియజేయదంటే...పీఎంఓ వివరణ

Why PM Modi Didnt Tweet Birthday Wishes For Adityanath
షార్ట్స్‌లో చూడండి
ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వంపై ఆ పార్టీ అధినాయకత్వం ఆందోళనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ రాష్ట్రానికి చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బహిరంగంగానే విమర్శలు చేస్తుండడం గమనార్హం. వీటికి తోడు నేడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలపకపోవడంతో పార్టీలో లుకలుకలు పెద్ద ఎత్తునే ఉన్నట్లు ట్విటర్‌లో నెటిజెన్లు గుసగుసలాడుకుంటున్నారు. సాధారణంగా మోదీ ప్రముఖుల జన్మదినం రోజు తప్పనిసరిగా ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతుంటారు.

అయితే, మోదీ ట్విటర్‌ వేదికగా ఆదిత్యనాథ్‌కు శుభాకాంక్షలు తెలపకపోవడానికి విభేదాలు కారణం కాదని ప్రధాని కార్యాలయం స్పష్టతనిచ్చింది. శనివారం ఆదిత్యనాథ్‌తో నేరుగా మాట్లాడి ప్రధాని శుభాకాంక్షలు తెలియజేసినట్లు వెల్లడించింది. కరోనా రెండో దశ విజృంభణ తీవ్ర రూపం దాల్చినప్పటి నుంచి మోదీ ఎవరికీ ట్విటర్‌ వేదికగా, బహిరంగంగా శుభాకాంక్షలు తెలపడం లేదని వివరణ ఇచ్చింది. ఇటీవల జన్మదినం జరుపుకున్న కేరళ, రాజస్థాన్‌, హరియాణా, గోవా ముఖ్యమంత్రులకు సైతం మోదీ శుభాకాంక్షలు తెలియజేయలేదని వెల్లడించింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీకి ప్రతికూల పవనాలు వీస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ మధ్య ఆరెస్సెస్‌ సహా ప్రధాని, పార్టీ జాతీయ నాయకులు, యూపీలో కీలక  నేతలు కలిసి ఓ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించే విషయంపై విస్తృతంగా చర్చించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ, ప్రభుత్వంలో మార్పులు తప్పవంటూ వదంతులు ఊపందుకున్నాయి. వీటికి తోడు ఈరోజు ఆదిత్యనాథ్‌కు మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయకపోయే సరికి పార్టీలో మార్పులు తథ్యమని అంతా చర్చించుకున్నారు. కానీ, వాటన్నింటినీ ప్రధానమంత్రి కార్యాలయ వివరణ కొట్టిపారేసింది.
Go Back to Shorts
modi
Yogi Adityanath
BJP
Uttar Pradesh
Twitter

More Telugu News