ఐపీఎల్ జరగాలంటే... బీసీసీఐ ముందున్న ఆప్షన్లు ఇవే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐపీఎల్ జరగాలంటే... బీసీసీఐ ముందున్న ఆప్షన్లు ఇవే!

3 Options Before BCCI on IPL
  • 10 రోజుల్లో తిరిగి పోటీలను ప్రారంభించాలని భావిస్తున్న బీసీసీఐ
  • ముంబైలోని మూడు స్టేడియాల్లో పోటీలకు అవకాశం
  • కుదరకుంటే దుబాయ్ కి తరలింపు
  • పలు మార్గాలను అన్వేషిస్తున్న బీసీసీఐ
ఐపీఎల్ జరిగి తీరుతుందని చెబుతూ వచ్చిన బీసీసీఐ, ఇప్పుడు పరిస్థితులకు తలొగ్గి, నిరవధిక వాయిదాను వేసింది. తిరిగి పోటీలు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న విషయమై స్పష్టత లేకున్నా, మరో 10 రోజుల వ్యవధిలో పోటీలను ప్రారంభించాలని భావిస్తున్న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, అందుకు మూడు ఆప్షన్స్ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం.

ఐపీఎల్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, ఒకే ఒక్క వేదికను నిర్ణయించుకుని, అక్కడే అన్ని మ్యాచ్ లూ జరపడం ఒక ఆప్షన్ కాగా, జూన్ లో కేసులు తగ్గుతాయని భావిస్తున్న నేపథ్యంలో, పోటీలు జూన్ వరకూ వాయిదా వేయడం మరొకటి. మూడో ఆప్షన్ గా, ఆటగాళ్లను దుబాయ్ కి తరలించి, అక్కడే మ్యాచ్ లను నిర్వహించడాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

మరో పది రోజుల్లో క్రికెటర్లు, వాటి ఫ్రాంచైజీలకు క్వారంటైన్ పూర్తి అవుతుంది. అప్పుడిక ముంబైలో అన్ని మ్యాచ్ లనూ జరిపించాలని బీసీసీఐ యోచిస్తోంది. ముంబైలో మూడు స్టేడియాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ స్టేడియాలకు దగ్గర్లోని హోటళ్లను సైతం బీసీసీఐ సంప్రదించింది. పలు నగరాల్లో బయో బబుల్ ను నిర్వహించడం కన్నా, ఒకే నగరంలో అయితే బాగుంటుందని బీసీసీఐ భావిస్తోంది. నగరంలోని వాంఖడే, బ్రబౌర్న్, జింఖాన్ గ్రౌండ్స్ లో పోటీలు జరిపిస్తే సరిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇక రెండో ఆప్షన్ గా కనీసం జూన్ వరకూ పోటీలను వాయిదా వేయాలన్నది మరో యోచన. అదే జరిగితే, ఇండియా - న్యూజిలాండ్ మధ్య సౌతాంప్టన్ వేదికగా జరగాల్సిన వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ తుదిపోరును వాయిదా వేయాల్సి వుంటుంది. అందుకు ఐసీసీ అనుమతి అవసరం. జూన్ 18న ఈ పోటీ జరగాల్సి వుండగా, దాన్ని జులైకి మార్చాలని బీసీసీఐ కోరి, అందుకు అనుమతి లభిస్తేనే ఈ ఆలోచన కార్యరూపం దాల్చే వీలుంటుంది.

మూడో ఆప్షన్ దుబాయ్. టీ-20 వరల్డ్ కప్ పూర్తి కావడానికి ముందే ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్ లను పూర్తి చేయాలంటే, యూఏఈని బ్యాకప్ వేదికగా చేసుకోవాలని బీసీసీఐ ఆదిలోనే నిర్ణయించింది. ఇప్పుడు ఆ ఆప్షన్ ను మరోసారి పరిశీలించి, ఐపీఎల్ ను దుబాయ్ లో ముగించాలని కూడా అధికారులు యోచిస్తున్నారు. తమ ముందున్న అవకాశాల్లో ఏది జరుగుతుందో వేచి చూడాలి.
BCCI
IPL
Matches
Mumbai

More Telugu News