కశ్మీర్లో కలవరం రేకెత్తిస్తున్న 'అతికించే బాంబులు'
- ఆఫ్ఘనిస్థాన్ లో విధ్వంసానికి కారణమవుతున్న అతికించే బాంబులు
- ఇప్పుడు కశ్మీర్ లోనూ ఈ తరహా బాంబులు
- ఇటీవల భద్రతా దళాల దాడుల్లో ఈ బాంబులు లభ్యం
- అయస్కాంతం సాయంతో వాహనాలకు అతికించే సౌలభ్యం
గత కొన్నినెలలుగా జమ్మూ కశ్మీర్ లో జరిపిన అనేక సోదాల్లో ఈ అతికించే బాంబులు లభ్యమయ్యాయని సీనియర్ భద్రతాధికారులు వెల్లడించారు. ఇవి చాలా చిన్నవిగా కనిపించే ఐఏడీ బాంబులని, కానీ ఎంతో శక్తిమంతమైనవని కశ్మీర్ లోయ పోలీస్ చీఫ్ విజయ్ కుమార్ వివరించారు. ఈ తరహా బాంబులు కశ్మీర్లో భద్రతా బలగాల కదలికలపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ తిరుగుబాటుదారులు ప్రారంభించిన ఈ అతికించే బాంబులు క్రమంగా భారత్, పాక్ సరిహద్దులకు చేరాయి. ఆఫ్ఘనిస్థాన్ లో అతికించే బాంబులు ఉపయోగించి భద్రతా దళాలను, జడ్జిలను, ప్రభుత్వ అధికారులను, సామాజిక ఉద్యమకారులను, పాత్రికేయులను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించారు. ఈ బాంబులను పాకిస్థాన్ నుంచి డ్రోన్లు, సొరంగ మార్గాల ద్వారా కశ్మీర్ కు తరలిస్తున్నట్టు విజయ్ కుమార్ తెలిపారు.