తెలంగాణలో తెరుచుకోనున్న విద్యాసంస్థలు.. కీలక ఆదేశాలను జారీ చేసిన కేసీఆర్!
- ఫిబ్రవరి 1 నుంచి తెరుచుకోనున్న విద్యాసంస్థలు
- 9 నుంచి ఆపై తరగతులకు రెగ్యులర్ క్లాసులు
- ప్రగతి భవన్ లో అత్యున్నత సమీక్ష నిర్వహించిన కేసీఆర్
ఈ భేటీలో ప్రధానంగా విద్యాసంస్థల ప్రారంభం పైనే సుదీర్ఘ చర్చ కొనసాగింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ, విద్యాసంస్థల నిర్వహణ సాధ్యమేనని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. దీంతో, పాఠశాలల పునఃప్రారంభానికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరో 20 రోజుల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. దాదాపు 10 నెలలుగా విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఉద్యోగ ఖాళీలన్నింటినీ ఒకేసారి భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. రెవెన్యూకు సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరించాలని అన్నారు. ధరణి పోర్టల్ లో నెలకొన్న సమస్యలను వారం రోజుల్లోగా పరిష్కరించాలని... అన్ని రకాల మార్పులు, చేర్పులు పూర్తి చేయాలని ఆదేశించారు.
వైకుంఠధామాల నిర్మాణాలను పూర్తి చేయాలని, వెంటనే వాటిని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. జనాభాకు సరిపడే విధంగా అన్ని పట్టణాల్లో సమీకృత మార్కెట్లను నిర్మించాలని ఆదేశించారు. అడవుల రక్షణకు ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో పదోన్నతులను కల్పించేందుకు కసరత్తును ప్రారంభించాలని ఆదేశించారు.