వైద్యో నారాయణో హరి... తన పేషెంట్ల బిల్లులను మాఫీ చేసిన క్యాన్సర్ వైద్యుడు
- ఆర్కాన్సాస్ లో క్యాన్సర్ ఆసుపత్రి స్థాపించిన డాక్టర్ అతిఖ్
- 30 ఏళ్లుగా రోగులకు సేవలు
- ఇటీవల క్లినిక్ మూసేయాలని నిర్ణయం
- రోగులు బకాయిలు పడినట్టు గుర్తించిన వైద్యుడు
- బిల్లులు మాఫీ చేస్తూ అందరికీ క్రిస్మస్, న్యూ ఇయర్ కానుక
ఆర్కాన్సాస్ ప్రాంతంలోని పైన్ బఫ్ ప్రాంతంలో 30 ఏళ్ల కిందట డాక్టర్ ఒమర్ అతిఖ్ క్యాన్సర్ క్లినిక్ నెలకొల్పారు. మొదటి నుంచి సేవాభావంతో వైద్యచికిత్స అందించిన ఈ వైద్యుడు ఏనాడూ ఆర్థిక కారణాలతో రోగులకు చికిత్స నిరాకరించలేదు. తమ ప్రాణాలు నా చేతిలో ఉన్నాయని రోగులు నమ్మకం వ్యక్తం చేయడాన్ని తనకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తాను అని అతిఖ్ వెల్లడించారు.
అయితే ఇప్పటివరకు తాను రోగుల చికిత్సలోనే మునిగితేలానని, బిల్లుల వ్యవహారం ఆసుపత్రి సిబ్బంది చూసుకునేవారని వెల్లడించారు. ఆయన ఇటీవల తన క్లినిక్ ను మూసేసి బోధన రంగంలో ప్రవేశించాలనుకుంటున్నారు. అందుకే తన క్లినిక్ కు సంబంధించిన లెక్కలు చూసి ఆశ్చర్యపోయారు. చాలామంది పేషెంట్లు బిల్లులు చెల్లించలేక, కొద్దిపాటి మొత్తాలను మాత్రమే చెల్లించడం ఆయన దృష్టికి వచ్చింది. దాంతో అలాంటి వాళ్లను గుర్తించి వారి బిల్లులు మొత్తాన్ని మాఫీ చేయాలని నిర్ణయించుకున్నారు. తన చర్యతో వాళ్ల జీవితాలు సాఫీగా సాగుతాయని భావిస్తున్నట్టు తెలిపారు. పాకిస్థాన్ నుంచి అమెరికా వలస వచ్చిన డాక్టర్ అతిఖ్ కు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.