టాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు

తెలుగు చిత్రపరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. అతడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. యూసుఫ్‌గూడ మధురానగర్‌కు చెందిన కార్తీక్ (24) టాలీవుడ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 20న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లిన కార్తీక్ ఆ తర్వాతి రోజు బయలుదేరి నగరానికి చేరుకున్నాడు. అయితే, ఇంటికి వెళ్లకుండా నేరుగా మాదాపూర్‌లోని స్నేహితుల వద్దకు వెళ్లాడు.

ఆ తర్వాత స్నేహితులతో కలిసి పంజాగుట్ట చేరుకున్న కార్తీక్ ఇంటికి మాత్రం వెళ్లలేదు. దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే అది స్విచ్చాఫ్ అని రావడంతో అతడి కోసం గాలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో కార్తీక్ తండ్రి ఉత్తరాది లక్ష్మీనారాయణ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కార్తీక్ ఇటీవల తన స్నేహితులు వంశీ, క్రాంతి, నివాస్ తదితరులతో కలిసి ఓ టీవీ చానల్‌లో కార్యక్రమం కోసం రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టించాడని, ఆ తర్వాత స్నేహితుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆందోళనకు గురై ఎటో వెళ్లిపోయి ఉంటాడని లక్ష్మీనారాయణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tollywood
assistant director
missing
punjagutta police

More Telugu News