అవన్నీ తప్పుడు ఒపీనియన్ పోల్స్... ఎలాగైనా గెలిచేది నేనే: ట్రంప్
Add ap7am to your home Screen

అవన్నీ తప్పుడు ఒపీనియన్ పోల్స్... ఎలాగైనా గెలిచేది నేనే: ట్రంప్

Trump Says Anyway I will Win
  • నార్త్ కరోలినాలో చివరి ప్రచార సభ
  • బైడెన్ గెలిస్తే అవినీతి పెరుగుతుంది
  • వైట్ హౌస్ లోకి వెళితే బైడెన్ నిద్రపోతాడు
  • విమర్శలు గుప్పించిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు చివరి ప్రచారాన్ని నిర్వహించిన ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఎలాగైనా తానే గెలవనున్నానని కీలక వ్యాఖ్యలు చేశారు. నార్త్ కరోలినా పరిధిలోని ఫ్యేటవిల్లీలో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న ఆయన, అధ్యక్ష ఎన్నికలపై వచ్చినవన్నీ తప్పుడు ఒపీనియన్ పోల్సేనని కొట్టి పారేశారు. తన ప్రత్యర్థి బైడెన్ గెలిస్తే, అవినీతి పెరిగిపోతుందని, వైట్ హౌస్ లో ఆయన నిద్రించడం మినహా మరేమీ చేయలేరని విమర్శలు గుప్పించారు. 

"నాలుగేళ్ల క్రితం మీరు ఓ బయటి వ్యక్తిని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అతను అమెరికాను అగ్రరాజ్యంగా నిలిపాడు. ఇప్పుడు వెళ్లండి. అందరూ ఓటేయండి. నేను మిమ్మల్ని కోరేది అదే. వస్తున్న ఒపీనియన్ పోల్స్ ఫలితాలను నేనూ చూస్తున్నాను. వాటిని నమ్మకండి. అవి తప్పుడు పోల్స్" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా, ఒపీనియన్ పోల్స్ లో అత్యధికం, ట్రంప్ ఓటమి చెందనున్నారని, బైడెన్ ను అమెరికన్ ప్రజలు తమ అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారని చెబుతున్న సంగతి తెలిసిందే.

ఇక నేడు అమెరికాకు అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. సుమారు 9 కోట్లకు పైగా ఓట్లు ఇప్పటికే బ్యాలెట్ బాక్సుల్లోకి చేరిపోయాయి. మొత్తం దాదాపు 25.52 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి వుంది. ఇప్పటికే 30 శాతానికి పైగా ఓట్లు పడగా, కనీసం మరో 30 శాతం ఓటింగ్ నేడు నమోదవుతుందని అంచనా. అదే జరిగితే, 2016లో నమోదైన 55.5 శాతం ఓటింగ్ ను దాటినట్లవుతుంది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అటు ట్రంప్, ఇటు బైడెన్ తమ సర్వ శక్తులనూ వినియోగించారు. కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతున్నప్పటికీ, ప్రచార జోరును కొనసాగించారు.
Donald Trump
Openion Polls
Elections
Biden

More Telugu News