రివర్స్ అయిన బ్రహ్మాజీ ‘బోటు' ట్వీట్.. ట్విట్టర్ నుంచి తప్పుకున్న సినీ నటుడు!
- ఓ మోటారు బోటు కొనాలనుకుంటున్నానంటూ ఇటీవల ట్వీట్
- దయచేసి ఓ మంచి బోటు గురించి తెలపండని సెటైర్
- మండిపడ్డ నెటిజన్లు
- ప్రజలు బాధపడుతుంటే ఇలాంటి ట్వీటా అంటూ తీవ్ర విమర్శలు
‘ఓ మోటారు బోటు కొనాలని అనుకుంటున్నాను. దయచేసి ఓ మంచి బోటు గురించి తెలపండి’ అని బ్రహ్మాజీ ఇటీవల ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. #HyderabadFloods అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఆయన తగిలించాడు. ఆయనకు సలహాలు ఇస్తూ నెటిజన్లు కూడా సెటైర్లు వేశారు. అయితే, ఆయన చేసిన ఈ ట్వీట్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది.
హైదరాబాద్ ప్రజలను కుండపోత వర్షాలు నానా ఇబ్బందులకు గురిచేస్తోన్న నేపథ్యంలో ఆయన ఇటువంటి జోకులు వేయడం ఏంటని పెద్ద ఎత్తున తెలంగాణ వాసులు విమర్శలు గుప్పిస్తూ పోస్టులు చేశారు. వందలాది ఇళ్లు జలదిగ్బంధంలో ఉండి ప్రజలకు నిత్యావసరాలు కూడా దొరకకపోతుంటే బ్రహ్మాజీకి ఈ పరిస్థితులు నవ్వులాటగా ఉన్నాయా? అంటూ నిలదీశారు. ఈ నేపథ్యంలోనే తన ట్విట్టర్ ఖాతాని ఆయన డియాక్టివేట్ చేసినట్లు తెలిసింది.