బీహార్ ఎన్నికల్లో అభ్యర్థుల విన్యాసాలు... ఒకరు గేదెను ఎక్కి ప్రచారం చేస్తే, మరొకరు గేదెపై ఊరేగుతూ నామినేషన్!
- త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు
- గేదెను ఎక్కి ప్రచారం చేసిన అభ్యర్థి అరెస్ట్
- ఆపై బెయిల్ పై విడుదల
ఈ నేపథ్యంలో మహ్మద్ పర్వేజ్ మన్సూరి అనే అభ్యర్థి ఓ గేదెను ఎక్కి ప్రచారం సాగించారు. చక్కగా ముస్తాబు చేసిన గేదె పైనుంచి ఆయన ప్రచారం చేస్తూ ముందుకు సాగిపోతుంటే ప్రజలు ఆశ్చర్యంతో తిలకించారు. మన్సూరి రాష్ట్రీయ ఉలేమా కౌన్సిల్ పార్టీకి చెందిన అభ్యర్థి. గయ నియోజకవర్గంలో ఆయన పోటీ చేస్తున్నారు. అయితే, ప్రచారానికి జంతువులను ఉపయోగించారన్న కారణంగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. జంతు చట్టం అతిక్రమించడమే కాదు, కరోనా నియమావళి కూడా ఉల్లంఘించారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు. ఎలాగోలా బెయిల్ తెచ్చుకుని విడుదలయ్యారు.
ఇక మరో ఘటనలో దర్భంగా జిల్లా బహదరాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న నాచారి మండల్ అనే రైతు నామినేషన్ వేసేందుకు గేదెపై ఊరేగుతూ వచ్చాడు. తాను రైతుబిడ్డనని, తన వద్ద కూర్చోడానికి కుర్చీ కూడా లేదని వెల్లడించాడు. తాను పేదవాడ్నని, అందుకే గేదెపై వచ్చానని వివరించాడు. రైతుకు గేదెలు, ఆవులు, ఎద్దులే సంపద అని పేర్కొన్నాడు.