భర్త హత్యకు దారితీసిన వివాదాలు.. కత్తితో పొడిచి దారుణంగా హతమార్చిన భార్య

wife killed her husband in Hyderabad
  • గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు
  • చేయి చేసుకోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన భార్య
  • నిందితురాలిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు
భర్తతో వివాదాలు తలెత్తడంతో విచక్షణ కోల్పోయిన భార్య, భర్తను పొడిచి చంపేసింది. హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. డెహ్రాడూన్‌కు చెందిన సబీనా రోషన్ (50), విశాల్ దివాన్ (45)లు భార్యాభర్తలు. సబీనా రోషన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా పని చేసి రిటైర్ కాగా, విశాల్ దివాన్ మేజర్‌గా పనిచేసి రిటైరయ్యాడు. సబీనాకు ఇప్పటికే ఓ వివాహం కాగా, విడాకులు తీసుకుంది. ఆమెకు 23 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. భర్తతో విడాకుల అనంతరం విశాల్ దివాన్‌ను సబీనా రెండో వివాహం చేసుకుంది. వీరికి 12 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.

గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. శనివారం మరోమారు వారిద్దరూ గొడవ పడి ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సబీనా భర్తను కత్తితో పలుమార్లు పొడిచింది. ఇది చూసిన పిల్లలు అరుస్తూ పక్కింటికి పరుగులు తీశారు. ఆరా తీసిన ఇరుగుపొరుగు విషయం తెలుసుకున్నారు. ఇంటికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న విశాల్‌ను ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలోనే అతడు ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సబీనాను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
Go Back to Shorts
Hyderabad
Husband
wife
murder
Crime News

More Telugu News