తొలి బ్యాచ్ వాక్సిన్ ను ఉత్పత్తి చేసిన రష్యా!

First Batch Vaccine Production Over in Russia
  • వ్యాక్సిన్ పై విమర్శలు వస్తున్నా పట్టించుకోని రష్యా
  • తొలుత డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు టీకా
  • రిజిస్టర్ చేసిన ఐదు రోజుల్లోనే ఉత్పత్తి
  • నెలకు 50 లక్షల డోస్ లు అందిస్తామన్న ఆరోగ్య మంత్రి
రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీపై ఎన్ని విమర్శలు వస్తున్నా, ఆ దేశం మరో ముందడుగు వేసింది. వ్యాక్సిన్ తొలి బ్యాచ్ ని తయారు చేశామని రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో శనివారం ప్రకటించారు. ఈ నెలాఖరులోగా దాన్ని డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలకు అందిస్తామని ఆయన పేర్కొన్నట్టు 'రాయిటర్స్' వార్తా సంస్థ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. కాగా, ప్రపంచంలోనే తొలిసారిగా కరోనాకు వ్యాక్సిన్ తయారు చేశామని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్న ఐదు రోజుల వ్యవధిలోనే తొలి బ్యాచ్ ని తయారు చేశామని ప్రకటించడం గమనార్హం.
 
ఇక ఈ వ్యాక్సిన్ ను సరిగ్గా పరిశీలించ లేదని పలు దేశాలు ఆరోపిస్తుండగా, మరికొన్ని దేశాలు, తమకు వ్యాక్సిన్ పంపాలని రష్యాను కోరుతున్నాయి. ఈ వ్యాక్సిన్ గురించిన సమాచారం తమకు అందలేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, వ్యాక్సిన్ కోసం రష్యాను సంప్రదిస్తున్న దేశాల్లో వియత్నాం, ఇజ్రాయిల్, సెర్బియా వంటి దేశాలున్నాయి. వ్యాక్సిన్ విషయంలో మిగతా దేశాలకన్నా రష్యాను ముందు నిలపాలని గట్టిగా నిర్ణయించుకున్న పుతిన్, పరీక్షలకు తగినంత సమయం ఇవ్వలేదని, తయారీ, ఉత్పత్తి కోసం తొందర పెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. 

ఇక వచ్చే రెండు వారాల్లో తొలి బ్యాచ్ లో భాగంగా తయారైన వ్యాక్సిన్ ను ప్రాధాన్యతా క్రమంలో ఇస్తామని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొన్ని విదేశీ కంపెనీలు తమ టీకాపై అనుమానాలు వ్యక్తం చేయడం అర్థరహితమని మిఖాయిల్ వ్యాఖ్యానించారు. సమీప భవిష్యత్తులో వ్యాక్సిన్ ను పెద్దఎత్తున తయారు చేయనున్నామని వెల్లడించిన ఆయన, డిసెంబర్ లేదా జనవరి నాటికి నెలకు 50 లక్షల డోస్ లను తయారు చేసి, ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో ఉన్నామని తెలిపారు.
Go Back to Shorts
Russia
Vaccine
First Batch

More Telugu News