హైడ్రాక్సీ క్లోరోక్విన్ వల్ల పెద్దగా ఉపయోగం లేదంటున్న తాజా అధ్యయనం!
- కరోనా చికిత్సలో ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్
- ఈ ఔషధం వల్ల మరణాలు కూడా సంభవిస్తున్నాయన్న అధ్యయనం
- ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న నిపుణులు
కరోనాను ఎదుర్కొనేందుకు ఈ మందు బాగా పనిచేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇటీవల పలుమార్లు పేర్కొన్నారు. అయితే, తాజా అధ్యయనంలో వెల్లడైన విషయాలతో ఈ ఔషధంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో కరోనా బారినపడి మరణించిన వారు, డిశ్చార్జ్ అయిన 368 మంది సీనియర్ సిటిజన్ల వైద్య రికార్డులను పరిశీలించిన అనంతరం అధ్యయనకారులు ఈ విషయాన్ని వెల్లడించారు.
కరోనా బారినపడి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తీసుకున్న రోగుల్లో మరణాల రేటు 28 శాతం ఉండగా, యాంటీబయాటిక్ అజిత్రోమైసిన్‌తో కలిపి ఈ మందును తీసుకున్న వారిలో మరణాల రేటు 22 శాతంగా ఉన్నట్టు తేలింది. అయితే, ప్రామాణిక వైద్యం పొందిన వారిలో మాత్రం మరణాల రేటు 11 శాతం మాత్రమే ఉండడం గమనార్హం.
ఫ్రెంచ్ శాస్త్రవేత్త దీదీర్ రౌల్ట్ కూడా ఈ డ్రగ్ కాంబినేషన్ వైరస్‌పై సమర్థంగా పోరాడుతుందని చెప్పడంతో ఈ ఔషధంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. అయితే, అధ్యయనం కోసం ఎంచుకున్న రోగులందరూ సీనియర్ సిటిజన్లు కావడం, వారు అప్పటికే మధుమేహం, రక్తపోటు వంటి జబ్బులతో బాధపడుతుండడంతో ఈ అధ్యయనంపై కంగారుపడాల్సిందేమీ లేదన్న వాదన కూడా వినిపిస్తోంది.