Chandrababu: సీఎం జగన్ కు చంద్రబాబు బహిరంగ లేఖ
- కరోనా, లాక్ డౌన్ తో పేదలు, రైతులు, వ్యాపారులు కుదేలయ్యారు
- వైసీపీ ప్రభుత్వ దుశ్చర్యల వల్లే రాష్ట్రంలో ‘కరోనా’ వ్యాప్తి
- పొంతన లేని లెక్కలతో ప్రజల్లో గందరగోళం సృష్టించొద్దు
ఏపీ సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఓ బహిరంగ లేఖ రాశారు. కరోనా, లాక్ డౌన్ వల్ల తలెత్తిన ఆరు అంశాలను పరిష్కరించాలని తన లేఖలో డిమాండ్ చేశారు. పేదలు, రైతులు, వ్యాపారులు పూర్తిగా కుదేలయ్యారని, ఇలాంటి కష్టకాలంలో విరాళాల పేరుతో వారిని వైసీపీ నేతలు వేధించారని ఆ లేఖలో ఆరోపించారు.
‘కరోనా’ సహాయక చర్యలనూ ప్రభుత్వం రాజకీయం చేయడం దారుణమని విమర్శించారు. 25 లక్షల మందికి నగదు, సరుకులు ఇవ్వకపోవడం శోచనీయమని, పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికీ లబ్ధి చేయడమే పాలనా ధర్మం అని సూచించారు. వైసీపీ ప్రభుత్వ దుశ్చర్యల వల్లే రాష్ట్రంలో ‘కరోనా’ వ్యాప్తి చెందిందని ఆరోపించారు. నమూనాల సేకరణ, పరీక్షలు, ఫలితాల వెల్లడిలో జాప్యం ప్రాణాంతకమని, పొంతన లేని లెక్కలతో ప్రజల్లో గందరగోళం సృష్టించడం సరికాదని ఆ లేఖలో పేర్కొన్నారు. టెస్టులు పెరగకుండా కేసులు పెరిగినట్టు చూపిస్తున్నారని ఆరోపించారు.