‘సర్కే చునార్’ సాంగ్ వివాదం.. క్షమాపణ చెప్పిన నటి నోరా ఫతేహి

Nora Fatehi Apologizes to NCW Over Sarkhe Chunar Song Controversy
  • 'సర్కే చునార్' పాట వివాదంపై మహిళా కమిషన్‌ ఎదుట హాజరైన నోరా
  • రాతపూర్వకంగా క్షమాపణ చెప్పిన బాలీవుడ్ నటి
  • కొంతమంది అనాథ బాలికల చదువు బాధ్యత తీసుకుంటానని ప్రకటన
  • గతంలో ఇదే పాటపై సంజయ్ దత్ కూడా క్షమాపణ చెప్పిన వైనం
బాలీవుడ్ నటి నోరా ఫతేహి ‘సర్కే చునార్’ పాట వివాదంపై జాతీయ మహిళా కమిషన్ (NCW) ఎదుట హాజరయ్యారు. ఈ పాటలో మహిళలను అభ్యంతరకరంగా చిత్రీకరించారన్న ఆరోపణల నేపథ్యంలో, ఆమె గురువారం ఢిల్లీలో కమిషన్ ముందుకు వచ్చి రాతపూర్వకంగా క్షమాపణలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎవరి మనోభావాలనూ దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.

"నన్ను ఆ పరిస్థితిలోకి నెట్టారు. ఒక కళాకారిణిగా నా బాధ్యతను నేను అర్థం చేసుకున్నాను. జరిగిన దానికి క్షమాపణ చెబుతున్నాను," అని నోరా వివరించారు. ఈ వివాదానికి పరిష్కారంగా కొంతమంది అనాథ బాలికల విద్యా బాధ్యతలను స్పాన్సర్ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించారు. కమిషన్ సభ్యులు తనకు ఎంతో సహాయం చేశారని పేర్కొన్నారు.

‘కేడీ ది డెవిల్’ చిత్రంలోని ఈ పాట హిందీ వెర్షన్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. గత నెలలో ఇదే పాటకు సంబంధించి నటుడు సంజయ్ దత్ కూడా మహిళా కమిషన్ ఎదుట హాజరై క్షమాపణలు చెప్పారు. ఆయన కూడా 50 మంది గిరిజన బాలికల విద్యకు సహాయం అందిస్తానని ప్రకటించారు.

తాను ఈ పాట కన్నడ వెర్షన్‌లో మాత్రమే నటించానని, హిందీ వెర్షన్ సాహిత్యం గురించి తనకు తెలియదని, తన అనుమతి లేకుండానే విడుదల చేశారని నోరా గతంలోనే స్పష్టం చేశారు. ప్రజల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో మేకర్స్ ఈ పాట హిందీ వెర్షన్‌ను యూట్యూబ్ నుంచి తొలగించారు.
Go Back to Shorts
Nora Fatehi
Sarkhe Chunar song
National Commission for Women
NCW
KD The Devil movie
Sanjay Dutt
Apology
Controversy
Bollywood
Song controversy

More Telugu News