'డోంట్ కేర్ కరోనా' అంటున్న స్వీడన్ ప్రజలు.. వారి స్టయిలే వేరు!
- లాక్ డౌన్ కు దూరంగా స్వీడన్
- స్వీయ నియంత్రణను పాటిస్తున్న ప్రజలు
- పని చేస్తున్న స్కూళ్లు
స్వీడన్ ప్రజల జీవన విధానమే ఆ దేశాన్ని ప్రపంచ దేశాలకు అతీతంగా నిలిపింది. ఇతర దేశాల్లో జనాలు గుంపులు గుంపులుగా గడపడానికి ఇష్టపడతారు. కానీ, స్వీడిష్ ప్రజలు గుంపులుగా బతకడానికి ఎక్కువగా ఇష్టపడరు. ఎవరి సొంత ప్రపంచంలో వారు బతకడానికే ఇష్టపడతారు. ఇదే వారిని కరోనా రక్కసి నుంచి కాపాడింది. ప్రజలంతా ఎవరికి వారు స్వచ్ఛందంగా సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వం తీసుకుంటున్న కొద్దిపాటి చర్యలు కరోనా విస్తరణను అడ్డుకుంటున్నాయి.
అన్ని దేశాల మాదిరే వర్క్ ఫ్రమ్ హోమ్ కు అక్కడి ప్రభుత్వం సూచించింది. అనవసర ప్రయాణాలను పెట్టుకోవద్దని, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరింది. కస్టమర్లు కూర్చున్న చోటుకే పదార్థాలను అందించాలని అన్ని రెస్టారెంట్లు, బార్లు, కేఫ్ లను ఆదేశించింది. 50 మంది కంటే ఎక్కువ మంది గుమికూడటంపై నిషేధం విధించింది. యూనివర్శిటీలు, కాలేజీలను మూసేసింది. అయితే, 16 ఏళ్ల లోపు విద్యార్థుల కోసం అన్ని స్కూళ్లు పని చేస్తుండటం గమనార్హం.