Youtube: యూట్యూబ్ లో చూస్తూ, ప్రియురాలికి ప్రసవం చేసే ప్రయత్నం చేసిన ప్రియుడు... బిడ్డ మృతి!

Police Arrest youth who tried to delivery his lover
  • తమిళనాడులోని గుమ్మడిపూండిలో ఘటన
  • పెళ్లి పేరిట నమ్మించిన యువకుడు
  • అడవిలోకి తీసుకెళ్లి ప్రసవం
  • అరెస్ట్ చేసిన పోలీసులు
యూ ట్యూబ్ లో వీడియోలు చూస్తూ, తన ప్రియురాలికి ప్రసవం చేసే ప్రయత్నం చేసి, బిడ్డ మృతికి కారణమైన ఓ యువకుడు ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడు. తమిళనాడులోని గుమ్మడిపూండిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే...

సౌందర్ (27) అనే యువకుడు గ్యాస్ ఏజన్సీలో పనిచేస్తూ, సిలిండర్లు సరఫరా చేస్తుంటాడు. ఓ కాలేజీ విద్యార్థిని అతనికి పరిచయం కాగా, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా లోబరచుకున్నాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. ఆమెలో శారీరక మార్పులను గమనించిన తల్లిదండ్రులు ఎన్నిసార్లు ప్రశ్నించినా, సాధారణ అనారోగ్యమేనని సమాధానం ఇచ్చిందా అమ్మాయి.

ఈ క్రమంలో ఎనిమిది నెలలు నిండిన తరువాత, ఆమెకు నొప్పులు ప్రారంభం కాగా, సౌందర్ కు విషయం చెప్పింది. దీంతో వెంటనే అతను గ్లౌజులు, కత్తెర, బ్లేడు తదితరాలను కొనుక్కొచ్చాడు. యువతిని సమీపంలోని అడవిలోకి బైక్ పై తీసుకెళ్లాడు. ఓ చెట్టు కింద పడుకోబెట్టి, వీడియోలు చూస్తూ ప్రసవం చేసే ప్రయత్నం చేశాడు.

బ్లేడుతో కోయడంతో గర్భంలోనే శిశువు చేయి, ఆమె పేగులు తెగి, తీవ్ర రక్తస్రావం అయింది. ఆమె స్పృహ కోల్పోవడంతో, సౌందర్ అతి కష్టం మీద ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చాడు. పరిస్థితి విషమించడంతో, ఆమెను చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆపరేషన్ చేసి, గర్భంలోని మగశిశువు మృతదేహాన్ని వెలికి తీశారు.  ఈ కేసులో సౌందర్ ను అరెస్ట్ చేశామని, యువతి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
Youtube
Videos
Delivery
Arrest
Tamilnadu
Police

More Telugu News