టీడీపీ నేతలు సైంధవుల్లా అడ్డుపడ్డారు: ఏపీ మంత్రి వెల్లంపల్లి విమర్శలు
- జనాభా ప్రాతిపదికన బీసీలకు రాజకీయాల్లో అవకాశం కల్పించాలని సీఎం భావించారు
- బీసీలపై టీడీపీకి ఉన్న ప్రేమ ఏపాటిదో అర్థమైంది
- 16 లక్షల మందికి కొత్తగా పెన్షన్ లు ఇస్తుంటే దుష్ప్రచారం చేస్తారా?
ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ, బీసీలను టీడీపీ ఓటు బ్యాంకుగానే చూసిందని, వారి అభివృద్ధికి పాటుపడ లేదని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే ప్రతిపక్ష టీడీపీ మోకాలడ్డే ప్రయత్నం చేస్తోందని, జనాభా ప్రాతిపదికన బీసీలకు రాజకీయాల్లో అవకాశం కల్పించాలని సీఎం భావిస్తే టీడీపీ నేతలు సైంధవుల్లా అడ్డు పడ్డారని ఆరోపించారు.
బీసీలపై టీడీపీకి ఉన్న ప్రేమ ఏపాటిదో బయటపడిందని, ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప టీడీపీకి ప్రజా సంక్షేమం అవసరం లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. టీడీపీ హయాంలో 44 లక్షల మందికి పెన్షన్ లు ఇస్తే సీఎం జగన్ 60 లక్షల మందికి అందిస్తున్నారని అన్నారు. పదహారు లక్షల మందికి కొత్తగా పెన్షన్ లు ఇస్తుంటే ఉన్నవి తొలగిస్తున్నారంటూ టీడీపీ నేతలు గోబెల్స్ ప్రచారం చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.