ఈ భూమండలం మీద ఇంకెవరి దగ్గరా లేని ఆయుధాలను భారత్ కు ఇవ్వబోతున్నాం: ట్రంప్
- భారత్ తో రక్షణ ఒప్పందాలకు సంబంధించి కీలక ప్రకటన చేసిన ట్రంప్
- రేపు 3 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకుంటామని వెల్లడి
- భారత్, అమెరికా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయన్న వ్యాఖ్యలు
"నా పరిపాలనలో అమెరికా సైన్యం పూర్తి శక్తిసామర్ధ్యాలు ఉపయోగించి రక్తపిపాసులైన ఐఎస్ఐఎస్ నరహంతకులని మట్టుబెట్టాం. ఐఎస్ఐఎస్ అధీనంలోని మొత్తం ప్రాంతం నాశనమైంది. కర్కోటకుడు అల్ బాగ్దాదీ హతమయ్యాడు. ఇక రక్షణ ఒప్పందాల్లో భాగంగా మా మిత్ర దేశం భారత్ కు ఈ భూమండలం మీద అత్యుత్తమం అనదగ్గ మిలిటరీ పరికరాలను అందించాలనుకుంటున్నాం. మరెవరూ తయారుచేయలేనంత గొప్ప ఆయుధాలను మేం తయారుచేశాం. ఇప్పుడు వాటి విషయంలోనే భారత్ తో ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం.
ప్రతి దేశం తనకు సురక్షితమైన సరిహద్దులు ఉండాలని కోరుకుంటుంది. పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను రూపుమాపేందుకు పాకిస్థాన్ తో మేం చాలా సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తున్నాం. పాక్ తో మా సంబంధాలు సజావుగానే ఉన్నాయి. మా సుదీర్ఘ ప్రయత్నాల ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. వాటి పట్ల మేం చాలా సంతృప్తిగా ఉన్నాం" అంటూ ప్రసంగించారు.