ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు తీసిన మతిస్థిమితం లేని మహిళ!

  • ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ఉండగా ఎత్తుకెళ్లిన వైనం 
  • చేతులు కట్టేసి నీటి డ్రమ్ములో పడేయడంతో విషాదం 
  • కర్నూలు నగరం పాతబస్తీలో ఘటన

మతిస్థిమితంలేని ఓ మహిళ చర్య ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు తీసింది. తల్లిదండ్రులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న బాలికను తీసుకువెళ్లి చేతులు కట్టేసి నీళ్ల తొట్టెలో పడేయడంతో ఊపిరాడక చనిపోయింది. 

వివరాల్లోకి వెళితే...కర్నూలు నగరం పాతబస్తీ పరిధి జొహరాపురానికి చెందిన షేక్ బషీర్ అహ్మద్ కుమార్తె రేష్మ (5). వీరి పక్కింట్లో ఓ మతిస్థిమితం లేని మహిళ ఉంది. భర్త పట్టించుకోక పోవడంతో ఆమె తండ్రితోపాటే ఉంటోంది. నిన్న ఉదయం ఇంటి వద్ద బాలిక ఆడుకుంటూ ఉండగా ఈ మహిళ చూసింది. బాలికను ఎత్తుకెళ్లి చేతులు కట్టేసింది. నీళ్ల డ్రమ్ములో పడేసి మూతవేసేసింది.

దీంతో ఊపిరాడక చిన్నారి చనిపోయింది. ఆడుకుంటున్న బిడ్డ కనిపించక పోవడంతో అహ్మద్ కుటుంబం చుట్టూ వెతికారు. ఆచూకీ దొరకక పోవడంతో ఎవరైనా ఎత్తుకు వెళ్లారన్న అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, మతిస్థిమితం లేని మహిళ తండ్రి ఇంటికి వచ్చి కాళ్లు కడుక్కునేందుకు డ్రమ్మువద్దకు వెళ్లబోయాడు.

దీంతో ఆ మహిళ తండ్రిని వెళ్లనీయకుండా అడ్డుకుంది. అప్పటికే చిన్నారి కనిపించక పోవడంతో స్థానికంగా కలకలం రేగి ఉండడం, తన కూతురు డ్రమ్ము వద్దకు వెళ్లనీయక పోవడంతో అనుమానం వచ్చిన అతను సమీపంలోకి వెళ్లి మూత తీయగా విగతజీవిలా పడివున్న రేష్మ కనిపించింది.

వెంటనే బయటకు తీసి ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. కర్నూలు ఒకటో పట్టణ పోలీసులు సదరు మహిళను అదుపులోకి తీసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Go Back to Shorts
kurnool
chaild murderd
mental women
Crime News

More Telugu News