పౌరసత్వ సవరణ చట్టంపై ఎలాంటి స్టే ఇవ్వబోము: సుప్రీంకోర్టు

  • సీఏఏను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మొత్తం 143 పిటిషన్లు 
  • చట్టానికి అనుకూలంగా కూడా కొన్ని పిటిషన్లు 
  • వాదనలు విన్న సుప్రీంకోర్టు
  • రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై ఈ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. సీఏఏపై సుప్రీంకోర్టులో మొత్తం 143 పిటిషన్లు దాఖలు కాగా, మరోవైపు ఈ చట్టానికి అనుకూలంగా కూడా కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి.

ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. సీఏఏపై దాఖలైన మొత్తం పిటిషన్లలో 60 పిటిషన్ల కాపీలు మాత్రమే తమకు అందాయని, తమ స్పందన తెలియజేసేందుకు గడువు కావాలని  కేకే వేణుగోపాల్ కోరారు. అయితే, ఇదే సమయంలో సీనియర్  న్యాయవాది కపిల్ సిబాల్ కలగజేసుకుని సీఏఏకు సంబంధించిన అన్ని ప్రక్రియలను నిలిపివేయాలని కోరారు.

ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. సీఏఏపై ఇప్పట్లో ఎలాంటి స్టే ఇవ్వబోమని  తెలిపింది. సీఏఏకు వ్యతిరేకంగా దాఖలైన కొత్త పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ విషయంపై అప్పటివరకు హైకోర్టులు ఎలాంటి విచారణలు చేపట్టవద్దని, ఉత్తర్వులు ఇవ్వద్దని ఆదేశాలు జారీ చేసింది.

సీఏఏపై వచ్చిన పిటిషన్లపై విచారణ జరిపేందుకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని  చెప్పింది. పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అంశంపై ఐదు వారాల తర్వాత విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. అసోం, త్రిపురకు సంబంధించిన పిటిషన్లను మాత్రం వేరుగా విచారిస్తామని సుప్రీంకోర్టు వివరించింది.
Go Back to Shorts
caa
Supreme Court

More Telugu News