మహారాష్ట్రకు తదుపరి ముఖ్యమంత్రి శివసేన నుంచే: మరోసారి స్పష్టం చేసిన సంజయ్ రౌత్

  • రాష్ట్రపతి పాలన విధించినప్పటికీ పట్టువీడని శివసేన
  • ఆసుపత్రి నుంచి సంజయ్ రౌత్ డిశ్చార్జ్
  • మీడియాకు తమ అభిప్రాయాన్ని స్పష్టం చేసిన శివసేన నేత
శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఛాతి నొప్పితో ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చేరి, చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఆయనను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'మహారాష్ట్రకు తదుపరి ముఖ్యమంత్రి శివసేన నుంచే' అని మరోసారి వ్యాఖ్యానించారు.

మహారాష్ట్రలో 50-50 ఫార్ములాను అమలు చేయాలని బీజేపీ ముందు డిమాండ్ పెట్టిన శివసేన తమ పట్టును వీడకపోవడంతో చివరకు ఆ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించేందుకు దారి తీసిన విషయం తెలిసిందే. ఇప్పటికే శివసేన మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రిగా తమ పార్టీ నేతే ఉంటారని అంటుండడం గమనార్హం.
 
కాగా, ఈ రోజు ఉదయం మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు కొందరు లీలావతి ఆసుపత్రికి వచ్చి సంజయ్ రౌత్ ను కలిశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విధించిన రాష్ట్రపతి పాలన, కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలపై చర్చించుకున్నారు. కాంగ్రెస్ తో పాటు శివసేన మద్దతును కూడగట్టేందుకు ఎన్సీపీ తమ ప్రయత్నాలను కొనసాగిస్తోంది.
Go Back to Shorts
Shiv Sena
Sanjay Raut
BJP
Maharashtra

More Telugu News