కంట్రోల్ బ్లాస్టింగ్ పద్ధతిలో తెలంగాణ సచివాలయం కూల్చివేతకు నిర్ణయం!

  • నూతన సచివాలయాన్ని నిర్మించనున్న తెలంగాణ సర్కారు
  • రెండు వారాల్లో అన్ని శాఖల తరలింపు
  • కూల్చివేతపై ఉపసంఘానిదే తుది నిర్ణయం
కంట్రోల్ బ్లాస్టింగ్... భవంతుల పునాదుల నుంచి అన్ని అంతస్తుల పిల్లర్లను డ్రిల్ చేసి, డైనమైట్లను అమర్చి, వాటిని ఓ క్రమ పద్ధతిలో పేల్చడం ద్వారా, భవంతిని కూల్చివేయడం. ఈ పద్ధతిలో చుట్టుపక్కల ఉన్న ఇతర భవనాలకు ఏ విధమైన నష్టమూ కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేసి, అదే ప్రాంతంలో కొత్త భవంతులను నిర్మించాలని భావిస్తున్న సర్కారు, పాత భవనాలను కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో కూలగొట్టాలని భావిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయగా, ఉపసంఘందే తుది నిర్ణయమని తెలుస్తోంది.

తెలంగాణ నూతన సచివాలయం డిజైన్లు ప్రస్తుతం తుది రూపును సంతరించుకుంటున్నాయి. వీటిని సాధ్యమైనంత త్వరగా ఖరారు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. సెక్రటేరియేట్ లో మొత్తం 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలుండగా, ఒక్కో భవనం ఒక్కో బ్లాక్ గా మొత్తం 10 వున్నాయి. వీటిల్లో జీ-బ్లాక్ గా ఉన్న సైఫాబాద్ ప్యాలెస్ అన్నిటికన్నా పాతది కాగా, మంత్రులున్న డీ-బ్లాక్ భవనం కొత్తది.

తొలుత ఎ, బి, సి, డి బ్లాక్ లలో ఉన్న ఆఫీసులను హెచ్, జే, కే బ్లాక్ లలోకి తరలించి, వాటిని కూల్చాలని భావించినప్పటికీ, ఉద్యోగులు, సందర్శకులు దుమ్ముతో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న ఆలోచనతో, అన్ని కార్యాలయాలనూ మరో చోటకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సచివాలయం ఎదురుగానే ఉండే బూర్గుల రామకృష్ణారావు భవనంతో పాటు మరికొన్నింటిని ఎంపిక చేశారు. మరో రెండు వారాల్లో అన్ని శాఖల తరలింపు పూర్తవుతుందని తెలుస్తోంది.
Go Back to Shorts
Telangana
Secretariate
Control Blasting
Sub Committe

More Telugu News