Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

న్యూజిలాండ్‌ కొంప ముంచిన ఓవర్ త్రో.. కివీస్‌కు జీవితాంతం క్షమాపణలు చెబుతూనే ఉంటానన్న ఇంగ్లండ్ ఆటగాడు స్టోక్స్

  • చివరి ఓవర్‌లో మారిన సమీకరణాలు
  • ఫీల్డర్ విసిరిన బంతి స్టోక్స్ బ్యాట్‌కు తాకి బౌండరీ దాటిన వైనం
  • మైదానంలోనే చేతులెత్తి కివీస్‌కు క్షమాపణలు చెప్పిన స్టోక్స్
ఆట ఏదైనా గెలుపును ఊహించడం కష్టం. చివరి నిమిషం వరకు విజయం ఎవరిని వరిస్తుందో చెప్పలేం. అనూహ్యంగా జరిగే ఘటనలు గెలుపు మలుపు తిప్పుతాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఆదివారం లార్డ్స్‌లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్. ఇంగ్లండ్ ఓటమి ఖాయమైపోయిన వేళ క్షణాల్లోనే సీన్ మారిపోయింది. ఇంగ్లండ్ విజయానికి చివరి ఓవర్లో 15 పరుగులు కావాలి. బౌల్ట్ వేసిన తొలి బంతికి పరుగు రాలేదు. దీంతో ఐదు బంతుల్లో ఇంగ్లండ్‌కు 15 పరుగులు అవసరం. రెండో బంతికి కూడా నో రన్. ఇంగ్లండ్ అభిమానుల నరాలు చిట్లి పోతున్నాయి. మూడో బంతికి స్టోక్స్ సిక్స్ బాదాడు. ఇంగ్లండ్ శిబిరంలో సంబరాలు.

ఇక, ఇంగ్లండ్ విజయానికి కావాల్సింది మూడు బంతుల్లో 9 పరుగులు. విజయం ఇరు జట్ల మద్య దోబూచులాడింది. సరిగ్గా అప్పుడే ఎవరూ ఊహించని అద్భుతం జరిగింది. బౌల్ట్ వేసిన నాలుగో బంతిని స్టోక్స్ బలంగా బాదాడు. అయితే బంతి బౌండరీకి వెళ్లలేదు. ఒక పరుగు పూర్తి చేసుకున్న స్టోక్స్ రెండో పరుగుకు కూడా సిద్ధమయ్యాడు. క్రీజువైపు వేగంగా పరిగెత్తుకొస్తున్న వేళ తనకందిన బంతిని ఫీల్డర్ కీపర్ వైపు బలంగా విసిరాడు. అదే సమయంలో స్టోక్స్ క్రీజులో బ్యాట్ ఆనించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఫీల్డర్ విసిరిన బంతి స్టోక్స్ బ్యాట్‌కు తాకి బౌండరీకి వెళ్లింది. దీంతో ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు వచ్చాయి. సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇంగ్లండ్ విజయానికి రెండు బంతుల్లో మూడు పరుగులు అవసరం. ఆ తర్వాత ఏ జరిగిందో అందరికీ తెలిసిందే.

ఇక, బంతి స్టోక్స్ బ్యాట్‌కు తాకి బౌండరీకి వెళ్లడంతో కివీస్ కెప్టెన్ విలియమ్సన్ నిశ్చేష్టుడయ్యాడు. మరోవైపు బెన్‌స్టోక్స్ మైదానంలోనే రెండు చేతులు పైకెత్తి కివీస్‌ను క్షమాపణలు కోరాడు. తప్పు తనదేనన్నట్టు అంగీకరించాడు. క్రీడాస్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. మ్యాచ్ అనంతరం స్టోక్స్ మాట్లాడుతూ.. తన వల్ల జరిగిన పొరపాటుకు న్యూజిలాండ్‌కు తాను జీవితాంతం క్షమాపణలు చెబుతూనే ఉంటానని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని విలియమ్సన్‌కు కూడా చెప్పానని స్టోక్స్ వివరించాడు.
England
new zealand
Ben Stokes
world cup

More Telugu News