రెండోసారీ ఆడపిల్లే పుట్టిందని.. భార్య, ఇద్దరు పిల్లలను రూ.3 లక్షలకు అమ్మేసిన భర్త

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. రెండో కాన్పులోనూ ఆడిపిల్లకే జన్మనిచ్చిందన్న కారణంతో భార్య, ఇద్దరు పిల్లలను మూడు లక్షలకు అమ్మేశాడో భర్త. బండ్లగూడ నూరీనగర్‌కు చెందిన ఫజల్ రహమాని (25)-ఇష్రత్ పర్వీన్ భార్యాభర్తలు. 2016లో పెళ్లైన వీరికి రెండేళ్ల పాప ఉంది. నాలుగు నెలల క్రితం పర్వీన్ మరో అమ్మాయికి జన్మనిచ్చింది. కొడుకు పుడతాడనుకుంటే ఆడపిల్ల పుట్టడంతో రహమాని తట్టుకోలేకపోయాడు. తల్లిదండ్రులతో కలిసి భార్యను వేధించడం మొదలుపెట్టాడు.

భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేని పర్వీన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఫజల్ తన తల్లిదండ్రులతో కలిసి వేరే చోట నివసిస్తున్నాడు. వారు వెళ్లిన తర్వాత పర్వీన్ అదే ఇంట్లో తల్లి, చెల్లితో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం సర్ఫరాజ్, అమ్దాద్ ఖాన్‌తోపాటు మరో వ్యక్తి పర్వీన్ ఇంట్లోకి చొరబడి బలవంతంగా వారిని లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. పర్వీన్, ఆమె పిల్లలను రహమాన్ తమకు రూ.3 లక్షలకు అమ్మేశాడని చెప్పడంతో వారు నిర్ఘాంతపోయారు. వెంటనే తేరుకుని కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.

నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని బేగంపేటకు చెందిన వారుగా గుర్తించారు. వారిని ప్రశ్నించి విడిచిపెట్టారు. నిందితులను పోలీసులు వదిలేశారని, ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు పర్వీన్ ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, పోలీసులు పట్టించుకోకపోవడంతో పర్వీన్ మహిళా సంఘాలను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Go Back to Shorts
Hyderabad
Police
baby girl
Bandlaguda
Telangana

More Telugu News