మృణాల్.. నువ్వు తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే స్థిరపడాలి: అల్లు అర‌వింద్‌

Allu Aravind Wants Mrunal Thakur to Settle in Telugu States
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి తొలిరోజు మిశ్రమ స్పందన లభించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ మీట్‌ను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు నాగ్ అశ్విన్, నందిని రెడ్డి, బన్నీ వాసు, స్వప్న దత్‌తో పాటు అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా హీరోయిన్ మృణాల్‌ను ఉద్దేశించి అన్న మాటలు సోషల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఈ వేడుకలో అల్లు అరవింద్ మాట్లాడుతూ చిత్ర బృందాన్ని అభినందించారు. హీరో అడివి శేష్‌పై ప్రశంసలు కురిపిస్తూ, "శేష్ నిజంగానే ఒక డెకాయిట్ లాంటి వాడు. ఎందుకంటే మంచి కథలను వెతికి పట్టుకుని, వాటితో ప్రేక్షకుల మనసులను దోచేస్తున్నాడు" అని సరదాగా వ్యాఖ్యానించారు. క్రైమ్ కథకు ప్రేమను జోడించి దర్శకుడు షానిల్ డియో సినిమాను అద్భుతంగా తీశారని, తాను చూసిన ఉత్తమ చిత్రాల్లో ఇదొకటిగా నిలుస్తుందని అన్నారు. నిర్మాత సుప్రియ యార్లగడ్డ కష్టాన్ని, ఎడిటర్ పవన్ కల్యాణ్ పనితనాన్ని ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.

ఇక, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటన గురించి మాట్లాడుతూ... “‘సీతారామం’లో సీతగా ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ‘డెకాయిట్’లో సరస్వతి పాత్రలో అంతకంటే పరిణతి చెందిన నటన కనబరిచింది. భావోద్వేగాలను అద్భుతంగా పలికించింది” అని ప్రశంసించారు. అనంతరం ఆమె వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నువ్వు తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే స్థిరపడాలి" అని ఆమెను ఆశీర్వదించారు.

గతంలో లావణ్య త్రిపాఠికి కూడా ఇలాగే చెప్పానని, ఆ తర్వాత ఆమె వరుణ్ తేజ్‌ను వివాహం చేసుకుని తమ ఇంటి కోడలైందని అల్లు అరవింద్ గుర్తుచేశారు. ఆయన మాటలకు మృణాల్ ఠాకూర్ సిగ్గుతో ముసిముసిగా నవ్వడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియో క్లిప్పులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "అరవింద్ గారి ఆశీర్వాదం ఫలించి లావణ్య మెగా కోడలైంది.. ఇప్పుడు మృణాల్ కూడా తెలుగింటి కోడలు అవుతుందా?" అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
Go Back to Shorts
Allu Aravind
Mrunal Thakur
Decoyit Movie
Adivi Sesh
Telugu Cinema
Tollywood
Lavanya Tripathi
Varun Tej
Success Meet
Telugu Boy

More Telugu News