మానవమృగం శ్రీనివాస్‌రెడ్డిలో మరో కోణం.. వేములవాడ యువతితో లవ్!

ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన సైకో శ్రీనివాస్‌రెడ్డి దారుణాలపై ఆరా తీస్తున్న పోలీసులకు అతడిలోని మరో కోణం గురించి తెలిసి ఆశ్చర్యపోతున్నారు. అమ్మాయిలతో పరిచయాలు పెంచుకుని ఆపై అత్యాచారానికి పాల్పడి గొంతు నులిమి చంపేసే ఈ కిరాతకుడిలో ప్రేమ కోణం కూడా ఉన్నట్టు తెలిసింది. దాదాపు ఏడాదిన్నర కాలంగా వేములవాడకు చెందిన ఓ యువతితో ప్రేమలో ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అమ్మాయి కనిపిస్తే దారుణానికి ఒడిగట్టే శ్రీనివాస్‌రెడ్డి ఈ యువతి విషయంలో మాత్రం అటువంటి నిర్ణయం తీసుకోకపోవడం పోలీసులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

ఓసారి వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయానికి వెళ్లిన శ్రీనివాస్‌రెడ్డికి స్థానిక యువతితో పరిచయం ఏర్పడింది. ఆమెపై మనసు పారేసుకున్న సైకో శ్రీనివాస్ పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు దర్యాప్తు చేస్తున్న రాచకొండ పోలీసులకు తెలిపాడు. అతడి ఫేస్‌బుక్ ఖాతాలో ఆమెతో కలిసి తీసుకున్న ఫొటోలు కనిపించడంతో అటువైపు దృష్టిసారించిన పోలీసులు అతడిని ప్రశ్నించగా ఈ విషయాలు వెల్లడించాడు. పెళ్లాడే ఉద్దేశంతోనే ఆమెకు ఎటువంటి హాని తలపెట్టకపోయి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు.

వేములవాడ యువతి తమ సామాజిక వర్గానికే చెందినది కావడం, అతడి ప్రతిపాదనకు అంగీకరించడంతోనే ఆమెను వదిలేసి ఉంటాడని చెబుతున్నారు. తరచూ వేములవాడ వెళ్లి ఆమెను కలిసేవాడని పేర్కొన్నారు. శ్రీనివాస్‌రెడ్డి గురించి పూర్తిగా తెలియని ఆమె అతడితో చనువుగా ఉండి ఉంటుందని పేర్కొన్నారు. శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదనను అంగీకరించడం ద్వారా ఆ యువతి బతికిపోయిందని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Telangana
Marri srinivas reddy
vemulawada
Rajanna Sircilla District
Police

More Telugu News