డెలివరీ బాయ్ అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేస్తే రూ.200 విలువైన కూపన్ పంపిన స్విగ్గీ
- బెంగళూరులో ఘటన
- డెలివరీ ఇవ్వడానికి వచ్చి అసభ్య ప్రవర్తన
- బాయ్ పై ఫిర్యాదు చేసిన మహిళ
అసలేం జరిగిందంటే, బెంగళూరుకు చెందిన ఓ యువతి గతవారం తనకెంతో ఇష్టమైన ఫుడ్ ను స్విగ్గీలో ఆర్డర్ చేసింది. ఆ ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వచ్చిన బాయ్, తన పనేదో తాను చూసుకోకుండా ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దాంతో భయపడిపోయిన ఆ యువతి ఫుడ్ పార్సిల్ ను లాగేసుకుని ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. అనంతరం, స్విగ్గీ కస్టమర్ కేర్ కు ఫిర్యాదు చేయగా, వాళ్లు ఆమెకు క్షమాపణలు తెలపడంతో పాటు రూ.200 విలువైన ఫుడ్ కూపన్ ను పంపారు.
ఆ డెలివరీ బాయ్ ప్రవర్తన బాధ కలిగించిందని భావిస్తే, స్విగ్గీ వ్యవహరించిన తీరు మరింత దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకు జరిగిన ఈ అవమానాన్ని ఆమె ఫేస్ బుక్ లో పెట్టడంతో స్విగ్గీ ప్రతినిధులు క్షమాపణలు చెప్పడమే కాదు, ఆ డెలివరీ బాయ్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.