ఈ దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే... కారణాలు వెల్లడించిన విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే!
- పాక్ మద్దతుతోనే ఉగ్రవాదుల దాడులు
- మరిన్ని ఆత్మాహుతి దాడులకు ప్లాన్
- వాటిని నివారించేందుకే సర్జికల్ స్ట్రయిక్స్
బాలాకోట్ లోని జైషే మహమ్మద్ శిబిరంపై జరిపిన వైమానిక దాడిలో అత్యధిక సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారని, ఆ సంఖ్యపై తాను ప్రస్తుతానికి ఏమీ చెప్పలేనని అన్నారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు బస చేసివున్నారన్న స్పష్టమైన సమాచారం తెలుసుకున్న తరువాతనే సాధారణ ప్రజల వైపు ప్రాణనష్టం సంభవించకుండా చర్యలు తీసుకుని దాడి చేశామని విజయ్ గోఖలే తెలిపారు. భారత్ పై తెగించిన ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడులను నివారించేందుకే వైమానిక దాడులు చేయాల్సివచ్చిందని స్పష్టం చేశారు.
పాకిస్థాన్ ప్రభుత్వం మద్దతు లేనిదే ఉగ్రవాద దాడులు జరగబోవని ప్రపంచం మొత్తానికీ తెలుసునని, ఐఎస్ఐ అండ చూసుకుని రెచ్చిపోయే ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పే తీరుతామని, అందులో భాగంగానే యుద్ధ విమానాలతో దాడులకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఇంకా వందల కొద్దీ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని, ఒక్కో చోట పదుల సంఖ్యలో ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నారన్న సమాచారం తమ వద్ద ఉందని గోఖలే వెల్లడించారు. ఈ దాడితో బాలాకోట్ లో ఉన్న ఉగ్రవాద శిబిరం పూర్తిగా ధ్వంసమైందని ఇది మౌలానా మసూద్ అజర్ కు కోలుకోలేని దెబ్బేనని పేర్కొన్నారు. దాడిలో జైషే మొహమ్మద్ ఉగ్రవాద శిక్షకులు, సీనియర్ కమాండర్లు మరణించారని తెలిపారు.