ఏపీలో దారుణం.. పదో తరగతి అమ్మాయిపై బ్లేడుతో దాడిచేసిన దుండగులు!
- తూర్పుగోదావరి జిల్లా చెయ్యేరులో ఘటన
- బాధితురాలి చేతికి తీవ్రగాయం
- కేసు నమోదుచేసిన పోలీసులు
జిల్లాలోని చెయ్యేరులో పదో తరగతి చదువుతున్న ఓ బాలిక ఈరోజు ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చింది. అయితే ఆమె కోసం అప్పటికే మాటువేసిన ఇద్దరు దుండగులు బైక్ పై వెంబడించారు. అనంతరం దగ్గరగా వెళ్లి ఒక్కసారిగా బ్లేడుతో దాడిచేశారు. దీంతో బాలిక చేతికి తీవ్ర గాయం అయింది.
ఈ సందర్భంగా బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో వారిద్దరూ ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. ఆమెను స్థానికులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రేమ వ్యవహారం కారణంగానే ఈ దాడి చోటుచేసుకుందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.