విశాఖ జిల్లాలో దారుణం.. పాత కక్షల కారణంగా తండ్రీకొడుకులను హతమార్చిన గ్రామస్తులు!

  • డుంబ్రిగూడ మండలం కొసిగూడలో ఘటన
  • చెరువు పనులు చేపట్టిన గ్రామస్తులు
  • కొద్దిరోజులు ఆగాలని కోరిన బాధితుడు
విశాఖపట్నం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పాతకక్షల కారణంగా గ్రామస్తులు ఓ కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులను కొట్టిచంపారు. అనంతరం వారి మృతదేహాలను పెట్రోల్ పోసి దహనం చేశారు.

జిల్లాలోని డుంబ్రిగూడ మండలం కొసిగూడలో ఉంటున్న జంబలి మోహనరావు కొండచీపుర్లను సాగుచేస్తున్నాడు. ఈ పొలం చెరువుకు సమీపంలో ఉంది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు చెరువు తవ్వకాల పనులు చేపట్టారు. అయితే దీని కారణంగా తన పంట దెబ్బతింటుందనీ, కోత పూర్తయ్యాక పనులు చేపట్టాలని వారిని కోరారు. అయితే గ్రామస్తులు ఇందుకు అంగీకరించలేదు.

ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చెలరేగడంతో పాత కక్షలున్న కొందరు గ్రామస్తులు మోహనరావుపై దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మోహన్ రావును ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు యత్నించిన అప్పారావును కూడా గ్రామస్తులు అడ్డుకున్నారు. తండ్రీకొడుకులపై విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. అనంతరం పోలీసులకు సాక్ష్యాలు లభించకుండా రెండు మృతదేహాలను పెట్రోల్ పోసి తగలబెట్టారు.

ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపును ప్రారంభించారు.
Go Back to Shorts
Visakhapatnam District
rivalary
killed
murder
father and son

More Telugu News