ఎయిర్ పోర్టుల్లో ఇకపై మరింత కఠినంగా వ్యవహరించనున్న సీఐఎస్ఎఫ్!
- ఎవరిని చూసినా చిరునవ్వు నవ్వరాదు
- భద్రత విషయంలో అశ్రద్ధ లేదన్న సంకేతాలు వెళ్లాలి
- ఏవియేషన్ సెక్యూరిటీ చీఫ్ ఎంఏ గణపతి
వాస్తవానికి ఎవరైనా సెలబ్రిటీలు కనిపించినా, ముద్దులొలికే చిన్నారులు తమ ముందుకు వచ్చినా, వారిని చూసి, చిరునవ్వు నవ్వే సిబ్బందే అధికంగా కనిపిస్తుంటారు. ఇకపై సెక్యూరిటీ సిబ్బంది అలా ఉండరాదని అడిషనల్ డీజీ, ఏవియేషన్ సెక్యూరిటీ చీఫ్ ఎంఏ గణపతి ఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణికుల భద్రత మరింత కట్టుదిట్టంగా ఉందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లేలా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. భారత విమానయాన రంగంలో భద్రతపై రెండు రోజుల సెమినార్ ప్రారంభం కాగా, ప్రసంగించిన గణపతి, ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
పాసింజర్ ఫ్రెండ్లీ ఫీచర్ ను తొలగించాలని, వారితో మరింత చనువుగా ఇకపై సెక్యూరిటీ సిబ్బంది ఉండబోరని సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ రంజన్ సైతం వ్యాఖ్యానించారు. ఓ చిరునవ్వు మంచిదే అయినా, తమ విధుల పట్ల ఏ మాత్రం అశ్రద్ధగా లేమన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాల్సి వుందని ఆయన అభిప్రాయపడ్డారు.