Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చేతి వేలు పైకి ఎత్తడానికి శక్తిలేక బాధపడ్డాను.. కనీసం నవ్వినా నొప్పే!: సోనాలి బింద్రే

  • నొప్పిని భరిస్తూ ఏడ్చా..
  • నొప్పి మానసికంగా, ఎమోషనల్‌గా దెబ్బతీస్తోంది
  • ప్రతి నిమిషం నాతో నేను పోరాటం చేస్తున్నా
  • భావోద్వేగానికి గురి కావడం తప్పేం కాదు
బాలీవుడ్‌ కథానాయిక సోనాలి బింద్రే కేన్సర్‌తో బాధపడుతూ న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆమె చాలా ధైర్యంగా ఉంటూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం సోనాలి పరిస్థితి నిలకడగా ఉందని ఆమె భర్త గోల్డీ బెహెల్‌ తెలిపారు. అయితే ఆమె ఎదుర్కొంటున్న చికిత్సా విధానం.. తను నొప్పిని భరిస్తున్న తీరును ట్విట్టర్ ద్వారా అభిమానులతో సోనాలి షేర్ చేసుకున్నారు.

‘గత కొన్ని నెలలుగా నాకు మంచి, చెడు రెండూ ఎదురయ్యాయి. నేను చాలా బలహీనపడిపోయాను. కనీసం చేతి వేలు పైకి ఎత్తడానికి కూడా శక్తిలేక బాధపడ్డాను. శారీరకంగా ప్రారంభమైన ఈ నొప్పి.. మానసికంగా, ఎమోషనల్‌గా దెబ్బతీస్తోంది. కీమో థెరపీ, సర్జరీ తర్వాత కొన్ని రోజులు చాలా కష్టమైంది.. కనీసం నవ్వినా నొప్పి వచ్చేది. కొన్నిసార్లు కేన్సర్‌ నా నుంచి మొత్తం తీసేసుకుంటున్న భావన కలుగుతోంది. ప్రతి నిమిషం నాతో నేను పోరాటం చేస్తున్నా. ఇలాంటి చెడు రోజులు జీవితంలో కచ్చితంగా వస్తుంటాయి. దాన్ని ఎదుర్కొని సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి.

ఆ నొప్పిని భరిస్తూ ఏడ్చా. మనకేం అవుతోందో, ఎటువైపు వెళ్తున్నామో కేవలం మనకు మాత్రమే తెలుస్తుంది. దాన్ని అంగీకరించడమే మంచిది. భావోద్వేగానికి గురి కావడం తప్పేం కాదు. నెగిటివ్‌ ఎమోషన్స్‌ను ఫీల్‌ అవడం కూడా తప్పు కాదు. కానీ, ఆ తర్వాత దాన్ని గుర్తించాలి. మీ జీవితంలో దాని ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. ఈ జోన్‌ నుంచి బయటికి రావడానికి చాలా స్వీయ జాగ్రత్త అవసరం. ఇలాంటి ఆలోచనలు రాకుండా చేయడంలో నిద్ర చాలా సహాయపడుతుంది. లేదా నా కుమారుడితో మాట్లాడుతూ ఉంటే చెడు ఆలోచనలు రావు.

ఇప్పుడు నా చికిత్స కొనసాగుతోంది.. నా రూపు కాస్త చక్కగా మారింది. త్వరలో ఇంటికి వచ్చేస్తాను’' అని సోనాలి తను బాధపడుతున్న విధానాన్ని తెలియజేస్తూనే అలాంటి చెడు రోజులు జీవితంలో ప్రతి ఒక్కరికీ ఎదురవుతాయని.. ఎదుర్కొని సంతోషంగా ఉండాలని సలహా ఇచ్చారు. 
Sonali Bendre
Goldi Behl
Cancer
New York

More Telugu News