బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తాకు పోలీసు భద్రత.. రాజ్ థాకరే తనను బెదిరించారన్న తనుశ్రీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తాకు పోలీసు భద్రత.. రాజ్ థాకరే తనను బెదిరించారన్న తనుశ్రీ!

  • తనుశ్రీకి పోలీస్ ప్రొటెక్షన్
  • ఇంటి చుట్టూ పోలీసుల కాపలా
  • తనుశ్రీకి పెరుగుతున్న బాలీవుడ్ మద్దతు
గత రెండు వారాలుగా బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా-నానాపటేకర్ వ్యవహారం ఇండస్ట్రీని ఊపేస్తోంది. ఇటీవల అమెరికా నుంచి భారత్‌కు వచ్చిన తనుశ్రీ పదేళ్ల క్రితం నానా పటేకర్ తనను సెట్స్‌లో లైంగికంగా వేధించాడని ఆరోపించి సంచలనం సృష్టించింది. నానాపటేకర్ వేధించినట్టుగా చెబుతున్న వీడియో క్లిప్ వైరల్ అయింది. అంతేకాదు, కొందరు దుండగులు ఆమె ప్రయాణిస్తున్న కారుపై దాడి చేశారు. ఇదంతా నానా పటేకర్ పనేనని, తనను బెదిరిస్తున్నాడని నటి ఆరోపించింది.

తనుశ్రీ ఆరోపణలపై స్పందించిన నానా పటేకర్ ఆమె అసత్య ఆరోపణలు చేస్తోందని, ఆమెపై పరువునష్టం దావా వేయనున్నట్టు చెప్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో  మాట్లాడిన తనుశ్రీ తనను నానా పటేకర్ బెదిరిస్తున్నాడని, రాజ్‌థాకరే పార్టీ ఎంఎన్ఎస్ నుంచి కూడా తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించింది. స్వయంగా రాజ్‌థాకరేనే తనను బెదిరించారని, దాడి తప్పదని హెచ్చరించారని పేర్కొంది.

ముంబై పోలీసులు తనను కలిశారని, 24 గంటలూ రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపింది. తన ఇంటి చుట్టూ సాయుధ పోలీసులు పహారా కాస్తారని చెప్పారని పేర్కొంది. తనకు రక్షణ కల్పించేందుకు ముందుకొచ్చిన ముంబై పోలీసులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్టు తెలిపింది.

తనుశ్రీ దత్తాకు పోలీస్ భద్రత‌పై మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. హోంమంత్రి దీపక్ వంత్ కేసార్కర్ మాట్లాడుతూ ఆమెపై ఇటీవల జరిగిన దాడుల నేపథ్యంలోనే పోలీసు రక్షణ కల్పించామని, నానాపటేకర్‌కు వ్యతిరేకంగా కాదని స్పష్టం చేశారు. ఎటువంటి ఫిర్యాదు లేకుండా ఓ వ్యక్తిని అనుమానించడం తగదని పేర్కొన్నారు. అతడు నటుడు మాత్రమే కాదని, ప్రముఖ సోషల్ వర్కర్ కూడా అని వివరించారు. కాగా, నానాపటేకర్ నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు ఆరోపిస్తున్న తనుశ్రీకి బాలీవుడ్ నుంచి మద్దతు లభిస్తోంది. సోనమ్ కపూర్, ప్రియాంక చోప్రా, స్వర భాస్కర్, రిచా చద్దా, ఫరాన్ అక్తర్ తదితరులు తనుశ్రీకి మద్దతు ప్రకటించారు.
Nana Patekar
Tanushree Dutta
Maharashtra
Protection
Deepak Vasant Kesarkar

More Telugu News