అందుకే, శృంగార సన్నివేశాలు నా సినిమాల్లో ఉండవు: సల్మాన్ ఖాన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందుకే, శృంగార సన్నివేశాలు నా సినిమాల్లో ఉండవు: సల్మాన్ ఖాన్

  • ఓసారి మా ఇంట్లో ఓ హాలీవుడ్ మూవీ చూస్తున్నాం
  • ముద్దు పెట్టుకునే సన్నివేశం వచ్చింది
  • మేమందరం ఒక్కసారిగా మా తలలు పక్కకు తిప్పేశాం
1989లో విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘మైనే ప్యార్ కియా’ ద్వారా వెండితెరకు పరిచయమైన హీరో సల్మాన్ ఖాన్ ఈరోజు అగ్రనటులలో ఒకరు. సల్మాన్ ఖాన్ చిత్రాల్లో కథ, పాటలు, ఫైట్స్.. ఇలా ప్రతిదీ ప్రత్యేకమే. రొమాన్స్, యాక్షన్, సెంటిమెంట్.. ఏ తరహా చిత్రాల్లోనైనా తన మార్క్ నటన ప్రదర్శించే సల్మాన్.. శృంగారభరితమైన సన్నివేశాలను చేయడానికి మాత్రం ఒప్పుకోడు. మొదటి నుంచి ఇదే మాట చెప్పే సల్లూ భాయ్ ఇప్పటికీ అదేమాటకు కట్టుబడి ఉన్నాడనడానికి ఆయన నటించిన చిత్రాలే నిదర్శనం.

ఈ తరహా సన్నివేశాలకు మీరు ఎందుకు దూరంగా ఉంటారని సల్మాన్ ని ఇటీవల ఓ విలేకరి ప్రశ్నించగా గతంలో తమ ఇంట్లో జరిగిన ఓ సన్నివేశం గురించి ప్రస్తావించాడు. ‘ఓసారి మా ఇంట్లో అందరం కలిసి ఓ హాలీవుడ్ మూవీ చూస్తున్నాం. ఆ సమయంలో నటీనటులు ముద్దు పెట్టుకునే సన్నివేశం వచ్చింది. అప్పుడు, మేమందరం ఒక్కసారిగా మా తలలు పక్కకు తిప్పేశాం. ఎందుకంటే, కుటుంబసభ్యులతో కలిసి చూసేటప్పుడు ఇలాంటి ఇబ్బందికర సన్నివేశాలు ఉండకూడదు.. అసహ్యంగా ఉంటుంది. అందుకే, సినిమాల్లో అలాంటి సన్నివేశాలు లేకుండా ఉండాలన్నది నా అభిప్రాయం. సినిమా విజయవంతం కావడానికి ఇలాంటి గిమ్మిక్స్ అవసరంలేదు’ అని చెప్పిన సల్మాన్ తన తొలి చిత్రం ‘మైనే ప్యార్ కియా’లోని ఓ సన్నివేశం గురించి ఈ సందర్భంగా ప్రస్తావించాడు.

‘ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నేను.. హీరోయిన్ భాగ్యశ్రీ కాలికి జండూబామ్ రాయాల్సిన సన్నివేశం ఉంది. ఆ సన్నివేశంలో నటిస్తున్నప్పుడు నా కళ్లుమూసుకుని ఆమె కాలికి జండూబామ్ రాశాను’ అని గుర్తు చేసుకున్న సల్లూ భాయ్, కేవలం, శృంగారం, గ్లామర్ మాత్రమే సినిమాలకు బిజినెస్ తెచ్చిపెట్టవని స్పష్టీకరించాడు. 
Bollywood
Salman Khan

More Telugu News