కిడారి, సోమల హత్యలకు మావోల మాస్టర్ ప్లాన్.. జామర్లు వాడి సిగ్నల్స్ నిలిపివేత!
- అనుమానిస్తున్న పోలీస్ ఉన్నతాధికారులు
- హత్య ఘటన రోజు జాడే లేని సెల్ ఫోన్ సిగ్నల్స్
- మంగళ, బుధవారాల్లో ఊర్లోకి అందుబాటులోకి
లివిటిపుట్టు గ్రామంలో కిడారి, సోమలను హత్య చేసినప్పుడు సెల్ ఫోన్ సిగ్నల్స్ అందుబాటులో లేకుండా పోయాయి. వీరి మరణాలను బయటి ప్రపంచానికి తెలియజేయడానికి దాదాపు కిలోమీటర్ దూరం ప్రయాణించి ఫోన్ చేయాల్సి వచ్చింది. అయితే మంగళవారం, బుధవారం గ్రామంలో ఉన్న పోలీసులు, అధికారుల ఫోన్లకు బీఎస్ఎన్ఎల్, జియో టవర్ సిగ్నల్స్ అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమ హత్యల సందర్భంగా మావోలు సెల్ ఫోన్ జామర్లను వాడారన్న అనుమానం బలపడుతోంది.
జామర్లతో తొలుత సిగ్నల్స్ ను బ్లాక్ చేసేసి, అనంతరం ఇద్దరు నేతలను మావోయిస్టులు చుట్టుముట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇది కేవలం మావోయిస్టుల పనేనా? లేక వారికి బయటివారు సైతం సాయం చేశారా? అన్న కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.