ఇదీ మా ఇల్లే.. షెల్టర్ హోమ్ ను వదిలివెళ్లే ముందు తళతళా మెరిసేలా శుభ్రం చేసిన కేరళ వరద బాధితులు!
- ఎర్నాకులం జిల్లా కూన్నమవులో ఘటన
- స్కూలులో తలదాచుకున్న 1,200 మంది
- వెళ్లేముందు శుభ్రం చేసిన వైనం
కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని కూన్నమవు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.. భారీ వర్షాలకు ఇళ్లు, పొలాలు దెబ్బతినడంతో గ్రామానికి చెందిన 1,200 మంది ప్రజలు ప్రభుత్వ హైస్కూలు నాలుగో అంతస్తులో ఆశ్రయం తీసుకున్నారు. నాలుగురోజుల తర్వాత వరద తగ్గడంతో ప్రజలు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఇలా వెళ్లేముందు స్కూలు గదులను తళతళా మెరిసేలా శుభ్రం చేసి వెళ్లారు.
ఈ విషయమై ఓ మహిళను మీడియా ప్రశ్నించగా.. ‘ఈ స్కూల్ భవనమే నాలుగు రోజులు మాకు ఇల్లుగా మారింది. దీన్ని అపరిశుభ్రంగా ఎలా వదిలేయను? మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి కదా?’ అని వ్యాఖ్యానించారు. కష్టాల్లో ఉన్నప్పటికీ కేరళ వాసులు చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.