కిడ్నాప్ చేసి అమ్మినోడు పోయాడు... మరి ఈ ఏడేళ్ల పాప తల్లిదండ్రులు ఎవరో!

  • ఐదేళ్ల క్రితం ఏడాదిన్నర పాప కిడ్నాప్
  • రూ. 30 వేలకు అమ్మిన కంసాని శంకర్
  • శంకర్ మరణంతో పాప వివరాలు ప్రశ్నార్థకం
ఏడాదిన్నర వయసులో ఉన్న బాలికను కిడ్నాప్ చేశాడో దుర్మార్గుడు. ఆపై పాపను ఓ మహిళకు రూ. 30 వేలకు అమ్మేశాడు. బాలికను పెంచి వ్యభిచారం చేయించి డబ్బు సంపాదించాలన్న ఆశతో ఆమె ఐదేళ్లు సాకింది. ఈ మధ్యలో కిడ్నాపర్ మరణించాడు. యాదగిరిగుట్టలో వ్యభిచార దందా బయటకు వచ్చిన తరువాత, భయపడిన వ్యభిచార నిర్వాహకురాలు, ప్రస్తుతం ఏడేళ్ల వయసులో ఉన్న బాలికను మరొకరికి రూ. 50 వేలకు అమ్ముతూ పోలీసులకు పట్టుబడింది. ఇప్పుడా పాప ఎవరో చెప్పేందుకు కిడ్నాపర్ లేడు.

జగిత్యాల జిల్లా మేడిపల్లి పోలీసులు తెలిపిన మరిన్ని వివరాల ప్రకారం, యాదగిరిగుట్టకు చెందిన కంసాని శంకర్ ఐదేళ్ల క్రితం హుస్నాబాద్ కు చెందిన కంసాని చంద్రకళకు ఓ బిడ్డను విక్రయించాడు. పాపను మరొకరికి ఎక్కువ ధరకు అమ్మడం లేదా వ్యభిచారం చేయించాలన్న ఉద్దేశంతో చంద్రకళ ఆమెను పెంచుతోంది.

గుట్ట దందా బయటపడ్డాక, పలు ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతుండగా, ఇక పాప తనవద్ద ఉంటే ప్రమాదమన్న ఆలోచనతో మేడిపెల్లి మండలం పోరుమల్లలో ఉన్న తన మేనత్త కవితకు రూ. 50 వేలకు పాపను విక్రయించింది. ఈ నెల 4వ తేదీన ఈ ఘటన జరుగగా, పోలీసుల తనిఖీల్లో భాగంగా కవిత ఇంట్లో బాలికను చూసి, ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. వారిని అరెస్ట్ చేసి, ఆ పాపను కరీంనగర్‌ శిశుసంరక్షణ కేంద్రానికి తరలించారు. చిన్నారిని కిడ్నాప్ చేసి తెచ్చి అమ్మిన శంకర్‌ మృతి చెందడంతో పాప ఎవరు? ఆమె తల్లిదండ్రులు ఎవరు? అన్నది ప్రశ్నార్థకమైంది.
Go Back to Shorts
Yadagirigutta
Kidnap
Prostitution

More Telugu News