Chandrababu: చంద్రబాబు తనకు పోటీదారుడవుతాడని మోదీ మైండ్ లో ఉందేమో!: ఎంపీ రామ్మోహన్ నాయుడు

చంద్రబాబు తనకు పోటీదారుడవుతాడని నరేంద్ర మోదీ మైండ్ లో ఉందేమోనని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశానంటే.. చంద్రబాబు ప్రొఫైల్ అటువంటిదని, మోదీ కన్నా ముందే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని, జాతీయస్థాయిలో బాబు అంటే చాలా గౌరవం ఉందని అన్నారు. ఒక ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తిగా చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తున్నారని ప్రశంసించారు.

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించకపోయినా చంద్రబాబు తన తెలివితేటలతో, నాయకత్వ లక్షణాలతో, స్వయంశక్తితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. మోదీకి తాను పోటీగా వెళ్లనని, తన రాష్ట్రమే తనకు ముఖ్యమని చంద్రబాబు ఎన్నిసార్లు స్పష్టం చేసినప్పటికీ, మోదీ కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తుండటం చాలా బాధాకరం, అప్రజాస్వామికమని అన్నారు.

విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రం తప్పించుకోవాలని చూస్తోందని, ఏపీ ప్రజల పోరాటాన్ని మోదీ అర్థం చేసుకోవాలని కోరారు. ఏపీ ప్రజల పోరాటాన్ని ప్రధాని రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో మోదీ విఫలమయ్యారని విమర్శించారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో తాము అడిగిన ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పలేకపోయిందని, తాము నైతికంగా విజయం సాధించామని అన్నారు. ఏపీకి న్యాయం చేసేందుకు అన్ని అవకాశాలను వినియోగించుకుంటామని, కేంద్రం తీరును ఎండగడతామని చెప్పారు.
Chandrababu
modi
ram mohannaidu

More Telugu News