కారుతో మాజీ కార్పొరేటర్ కుమారుడు అర్ధరాత్రి బీభత్సం

కాంగ్రెస్ నేత, మాజీ కార్పొరేటర్ మధుగౌడ్ కుమారుడు అక్షయ్ కుమార్ గౌడ్ శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చేసి పరారయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. కవాడిగూడకు చెందిన సాయికృష్ణ (21), యాకేష్ యాదవ్ (25) స్నేహితులు. ఆసిఫ్‌నగర్‌ కిషన్‌బాగ్‌లో ఉండే సాయికృష్ణ సోదరి ఇంటికి వెళ్లి తిరిగి అర్ధరాత్రి దాటాక 1:15 గంటల సమయంలో బైక్‌పై కవాడిగూడ వైపు వస్తున్నారు.

సచివాలయం పాత గేటు వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనకనుంచి వచ్చిన స్కోడా కారు బలంగా ఢీకొట్టింది. సాయికృష్ణ, యాకేష్ యాదవ్‌లు బైక్‌పై నుంచి ఎగిరి కిందపడ్డారు. ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడగా, వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే కారు డ్రైవర్ వారిని తన కారులోనే తీసుకెళ్లి హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించాడు.

ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. కారును అక్షయ్‌కుమార్‌గౌడ్‌ డ్రైవ్ చేస్తున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. కారులో అక్షయ్ ఐడెంటిటీ కార్డు లభించిందని, గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చిన తర్వాత కారును అక్కడే వదిలి పరారయ్యాడని పోలీసులు తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Go Back to Shorts
Road Accident
Congress
Hyderabad
Akshay kuma goud

More Telugu News