బీసీసీఐపై రూ.456 కోట్లకు కేసు వేసేందుకు సిద్ధమైన పాక్ క్రికెట్ బోర్డు

  • ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపణ
  • త్వరలో ఐసీసీలో కేసు
  • ఆర్థిక సమస్యలతో కునారిల్లుతున్న పీసీబీ
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)పై కేసు వేసేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సిద్ధమైంది. ఈమేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లోని వివాదాల పరిష్కార కమిటీని త్వరలోనే ఆశ్రయించనుంది.
 
2014లో బీసీసీఐ.. పీసీబీతో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఎనిమిదేళ్ల  (2015-2023) కాలంలో ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లు పాక్ జట్టుతో టీమిండియా ఆడాల్సి ఉంది. అయితే ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, రాజకీయ కారణాలతో బీసీసీఐ వెనక్కి తగ్గింది.

తమతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు బీసీసీఐ చేసుకున్న ఒప్పందాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదని పీసీబీ చైర్మన్ నాజమ్ సేథీ తెలిపారు. తమతో ఎటువంటి సమస్య లేకపోయినా భారత్ తమతో క్రికెట్ ఆడడం లేదని పేర్కొన్నారు. ఒక్క ఐసీసీ నిర్వహించే టోర్నీల్లోనే భారత్ తమతో ఆడుతోందన్నారు. తటస్థ వేదికలపై భారత్‌తో ఆడేందుకు తమకు ఎటువంటి ఇబ్బంది లేదని సేథీ తెలిపారు. అయితే బీసీసీఐ మాత్రం అందుకు అంగీకరించడం లేదని పేర్కొన్నారు.

బీసీసీఐ చర్యతో తమకు బోలెడంత నష్టం వాటిల్లిందని, కాబట్టి ఆ బోర్డు నుంచి తమకు నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా ఐసీసీని ఆశ్రయించనున్నట్టు పేర్కొన్నారు. మొత్తంగా 70 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 456 కోట్లు) ను బీసీసీఐ నుంచి నష్టపరిహారంగా ఇప్పించాల్సిందిగా ఐసీసీని కోరనున్నట్టు తెలిపారు.

కాగా, 2009లో పాకిస్థాన్ టూర్‌లో ఉన్న శ్రీలంక ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడి నుంచి ఆటగాళ్లు సురక్షితంగా బయటపడ్డారు. ఆ దాడి తర్వాత పలు దేశాలు పాకిస్థాన్‌లో జరగాల్సిన సిరీస్‌లను రద్దు చేసుకున్నాయి. ఇప్పటికీ ఆ దేశంలో అడుగుపెట్టేందుకు విదేశీ క్రికెటర్లు ఇష్టపడడం లేదు. దీంతో సిరీస్‌లు నిర్వహించలేక పీసీబీ ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది.
Go Back to Shorts
PCB
BCCI
ICC
compensation

More Telugu News