Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘గాలి’ కుమార్తె పెళ్లి ఖర్చు జస్ట్ రూ.30 కోట్లేనట.. ఐటీకి చెప్పిన జనార్దన్ రెడ్డి

కుమార్తె పెళ్లితో దేశం దృష్టిని ఆకర్షించిన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఆ పెళ్లికి ఖర్చు చేసింది ఎంతో తెలుసా? జస్ట్ రూ.30 కోట్లేనట. ఈ మేరకు ఆయన ఆదాయపు పన్ను శాఖ అధికారులకు లెక్కలు చూపించారు. కుమార్తె బ్రహ్మణి పెళ్లికి గాలి దాదాపు రూ.400 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజాగా ఐటీ అధికారులకు ఆయన సమర్పించిన లెక్కలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

నోట్ల రద్దు సమయంలో కుమార్తె పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కనీసం రూ. 2 వేలైనా దొరక్క ప్రజలు అల్లాడిపోతున్న వేళ, గాలి అంత గొప్పగా పెళ్లి ఎలా జరిపించాడంటూ విపక్షాలు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించాయి. పెళ్లి కోసం పెద్ద మొత్తంలో నల్లధనాన్ని అక్రమ మార్గాల్లో కొత్త నోట్ల రూపంలోకి మార్చుకున్నారని గాలిపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో గాలికి కర్ణాటక రెవెన్యూ అధికారి భీమా నాయక్ కీలకపాత్ర పోషించినట్టు తేలింది.

దీంతో పెళ్లి ఖర్చుల వివరాలు తెలపాలంటూ ఐటీ శాఖ జనార్దన్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ఆ వివరాలు సమర్పించారు. పెళ్లికి కేవలం రూ.30 కోట్లు మాత్రమే ఖర్చయినట్టు అందులో పేర్కొన్నారు. తన భార్య అరణాలక్ష్మి డైరెక్టర్ గా ఉన్న ట్యూబుల్ రివేట్స్ నుంచి నిధులు సమకూరినట్టు పేర్కొన్నారు. పెళ్లికి సంబంధించిన కొనుగోళ్లన్నీ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారానే జరిగినట్టు వివరించారు.

More Telugu News