ధోనీ రాజీనామా చేశాడా? లేక రాజీనామా చేయించారా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ధోనీ రాజీనామా చేశాడా? లేక రాజీనామా చేయించారా?

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీకి రాజీనామా చేశాడంటూ గత రెండు రోజులుగా వార్తా పత్రికలు, మీడియా ఛానెళ్లు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ధోనీ తనకు తానుగా రాజీనామా చేశాడా? లేక ధోనీతో రాజీనామా చేయించారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. టెస్టుల్లో జట్టు వరల్డ్ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. టెస్టు జట్టులో ఉన్న సభ్యులే వన్డే జట్టులో కూడా ఇంచుమించు స్థానం సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శనలో పెద్దగా మార్పులు చోటుచేసుకునే అవకాశం లేదు. ధోనీ కెప్టెన్సీలో ఘోరవైఫల్యాలు కూడా లేవు.

అయినప్పటికీ ఉరుములు, మెరుపులులేని వానలా ధోనీ రాజీనామా నిర్ణయం తీసుకుని, ప్రకటించేశాడు. ఈ పరిస్థితుల్లో ధోనీ రాజీనామాకు పెద్దగా కారణాలు కనిపించడం లేదు. వాస్తవానికి ధోనీ రాజీనామా డిమాండ్ లేనప్పటికీ జట్టులో పరిస్థితులన్నీ ధోనీకి వ్యతిరేకంగా మారాయి. ధోనీ గాయపడిన సమయంలో రవిశాస్త్రి చొరవతో టెస్టు కెప్టెన్ గా కోహ్లీని నియమించడం జరిగింది. అలా వచ్చిన తాత్కాలిక కెప్టెన్సీ అవకాశాన్ని కోహ్లీ వినియోగించుకుని అక్కడ స్థిరపడిపోయాడు. ఈ క్రమంలో వర్థమాన ఆటగాళ్లంతా కోహ్లీకి అనుకూలంగా మారారు.  

ధోనీ కోటరీలోని ఆటగాడిగా పేర్కొనే అశ్విన్ లాంటి ఆటగాడికి కూడా ఒక దశలో ధోనీతో పొసగలేదు. ఈ క్రమంలో ధోనీకి భవిష్యత్ నెమ్మదిగా అర్థమైంది. దీంతో టెస్టు కెప్టెన్సీని పూర్తిగా వదిలేసుకున్న తరువాత ఆలోచనలో పడ్డాడు. దీనికి తోడు వరల్డ్ కప్ కు సన్నద్ధం కావాల్సిన సమయం ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో జట్టు ఎలా ఉండాలన్న ఆలోచనను చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, ధోనీకి వివరించాడు. దీంతో రాజీనామాకు సమయం దగ్గరవుతోందని భావించిన ధోనీ, ఆలస్యం అమృతం విషం అని భావించి వెంటనే కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఇక ఆటగాడిగా ధోనీ రిటైర్మెంట్ కు కూడా సమయం ఆసన్నమవుతోంది. గతంలో జరిగిన సిరీస్ లలో బ్యాటుతో ధోనీ రాణించిన దాఖలాలులేవు. ఈసారి కూడా ధోనీ నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆశించేందుకు ఎవరూ సిద్ధంగా లేరు.

ఈ సారి ఫెయిల్ అయితే కనుక, రిటైర్మెంట్ కూడా ప్రకటించేస్తే ధోనీ కెరీర్ శుభప్రదంగా ముగుస్తుంది. లేని పక్షంలో వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ లాంటి ఆటగాళ్ల సరసన ధోనీ కూడా నిలవాల్సి వస్తుంది. వీరంతా ఒకప్పుడు టీమిండియాలో స్టార్ ఆటగాళ్లుగా వెలిగారు. కెరీర్ చివరి దశలో వీరికి సరైన వీడ్కోలు కూడా లభించక, బ్రాండ్ వాల్యూపడిపోయి, రంజీలకే పరిమితమై ఒక్క అవకాశం ఇస్తే అంతర్జాతీయ ఆటగాడిగా రిటైర్ అయ్యేందుకు ఆశగా ఎదురు చూస్తున్నారు.

More Telugu News