85 పరుగులకే చాప చుట్టేసిన ఆస్ట్రేలియా
సొంతగడ్డపై ఆడుతున్నా ఆస్ట్రేలియా ఆటతీరు మాత్రం మారలేదు. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా మరోసారి ఘోరంగా తడబడింది. కేవలం 85 పరుగులకే ఆసిస్ బ్యాట్స్ మెన్ ఆలౌట్ అయ్యారు. కెప్టెన్ స్మిత్ (48) మినహా మరెవరూ రాణించలేదు. తొమ్మిది మంది బ్యాట్స్ మెన్ రెండంకెల స్కోరు కూడా చేయలేక పోయారు. 10 పరుగులతో మిన్నీ సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. మిగిలిన వారిలో వార్నర్ 1 పరుగు, బర్న్స్ 1, ఖవాజా 4, వోగ్స్ 0, ఫెర్గ్యూసన్ 3, నెవిల్ 3, స్టార్క్ 4, హాజిల్ వుడ్ 8, లియోన్ 2 పరుగులు చేశారు. ఐదు వికెట్లు తీసి కంగారూలకు కంగారు పుట్టించాడు ఫిలాండర్. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.