హిమాచల్ లో కాసులు కురిపిస్తున్న ఢిల్లీ పొల్యూషన్
ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం చేరిన వేళ, పొరుగునే ఉన్న హిమాచల్ ప్రదేశ్ కు ఒక్కసారిగా ఆదాయం పెరిగింది. ఢిల్లీ వాసుల్లో చాలా మంది ఇప్పుడు స్వచ్ఛమైన గాలి కోసం హిమాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు టూరిస్టుల రూపంలో వెళుతున్నారు. సిమ్లా, ధర్మశాల వంటి ప్రాంతాలు ఢిల్లీ వాసులతో కిక్కిరిసిపోయాయి. కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు వీరంతా శీతల ప్రాంతాలను ఎంచుకుని వెళుతున్నారు. ఇక ఢిల్లీ వెళ్లాలని ముందుగా ప్లాన్ చేసుకున్న వారు సైతం ఢిల్లీకి బదులుగా, హిమాచల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు రూటు మారుస్తున్న పరిస్థితి నెలకొంది. ఢిల్లీలోని పొగమంచుతో గొంతునొప్పి తదితర సమస్యలతో బాధపడ్డామని, హిమాచల్ కు వచ్చిన తరవాతనే ఉపశమనం లభించిందని ఓ విదేశీ పర్యాటకురాలు వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా, ఒక్కసారిగా పెరిగిన టూరిస్ట్ ట్రాఫిక్ తో హోటల్ గదులకు డిమాండ్ పెరిగిందని హిమాచల్ ప్రదేశ్ టూరిజం అధికారి ఒకరు తెలిపారు.