గుంటూరు అర్బన్ బ్యాంకు చైర్మన్ పదవా? మజాకా?... టీడీపీ, బీజేపీలు రాజీ పడడంతో, రంగంలోకి దిగిన వైకాపా
గుంటూరు అర్బన్ బ్యాంక్ చైర్మన్ పదవికి నామినేషన్లు వేసేందుకు వైకాపా ఎమ్మెల్యే ముస్తఫా వర్గీయులు రావడం, వారిని తెలుగుదేశం, బీజేపీ వర్గీయులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నేడు నామినేషన్లు స్వీకరిస్తున్న వేళ, ఉదయం టీడీపీ, బీజేపీ నేతల మధ్య గందరగోళం చెలరేగగా, ఆపై చర్చలు జరిపి తెలుగుదేశం పార్టీకి చైర్మన్, బీజేపీకి డిప్యూటీ చైర్మన్ పదవులు ఇచ్చేందుకు పెద్దలు రాజీ కుదిర్చారు. ఆపై గొడవ సద్దుమణిగిందని భావించగా, మధ్యాహ్నం 12 గంటల సమయంలో ముస్తఫా, తన అభ్యర్థులతో కలసి తన వర్గీయులను వెంటబెట్టుకుని నామినేషన్లు వేసే ప్రాంతానికి వచ్చారు.
ఏకగ్రీవంగా ఎన్నికలు ముగుస్తాయని భావించిన వేళ, వైసీపీ రంగంలోకి దిగడంతో, అప్పటికే వివిధ పదవులకు పేర్లు ఖరారు చేసుకుని నామినేషన్లు సమర్పించిన ఆశావహులు, ఎన్నికలు జరిగితే ఏమైనా జరగవచ్చన్న భావనలో వారిని అడ్డుకున్నారు. దీంతో అటు టీడీపీ-బీజేపీ, ఇటు వైకాపా వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా, పోలీసులు కల్పించుకోవాల్సి వచ్చింది. నామినేషన్లకు ఇంకా సమయం ఉందని, తమను ఎవరూ అడ్డుకోలేరని ఈ సందర్భంగా ముస్తఫా వ్యాఖ్యానించారు. గుంటూరు అర్బన్ బ్యాంకుకు చైర్మన్ పదవంటే ఇంత పోటీనా? అని చూసేవారు ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.